జగన్ సర్కారుకు తొలి దెబ్బ.! విజయసాయి మాటలపై అనుమానాలు.!

 

జగన్ ప్రభుత్వానికి తొలి దెబ్బ తగిలింది. జపాన్ లేఖతో కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయాలన్న ఏపీ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో జగన్ సర్కారు తోక ముడిచినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో పీపీఏల రద్దును తీవ్రంగా పరిగణించిన జపాన్ ప్రభుత్వం... ఇండియన్ గవర్నమెంట్ కి ఘాటు లేఖ రాసింది. భారత విద్యుత్ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిన జపాన్.... జగన్ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే, ఖరారైన ఒప్పందాలను రద్దు చేయడాన్ని ఫ్రాన్స్, సౌతాఫ్రికా, ఐరోపా దేశాలు కూడా గమనిస్తున్నాయంటూ జపాన్ బాంబు పేల్చింది. దాంతో రంగంలోకి దిగిన ప్రధాని కార్యాలయం.... విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుపై ఏపీని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు పీపీఏలను రద్దుచేస్తే ఫారిన్ ఇన్వెస్టర్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇది భారత్ కు మంచిది కాదని తేల్చిచెప్పింది. సరైన ఆధారాల్లేకుండా పీపీఏలను రద్దుచేయడం సరికాదని, పారదర్శకంగా వ్యవహరించకపోతే పెట్టుబడులు తగ్గి, అభివృద్ధి దెబ్బతింటుందని హెచ్చరించింది. అవినీతి జరిగిందని స్పష్టంగా తేలితే తప్ప, చట్టబద్ధంగా కుదుర్చుకున్న ఏ ఒప్పందాన్నీ రద్దు చేయలేమని జగన్ సర్కారుకు గుర్తుచేసింది. 

అయితే, పీపీఏలన్నింటినీ తాము రద్దు చేయలేదని, కేవలం అవకతవకలు జరిగాయని నిర్ధారించిన ఒప్పందాలను మాత్రమే పునసమీక్షిస్తున్నట్లు కేంద్రానికి తెలియజేసింది. ఒకవైపు జపాన్ లేఖ... మరోవైపు కేంద్రం హెచ్చరికలతోనే జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులతోనే పీపీఏల సమీక్ష నిర్ణయం తీసుకున్నామంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినరోజే కేంద్ర విద్యుత్ శాఖ నుంచి ఈ ఆదేశాలు రావడం విజయసాయి మాటలపై అనుమానాలు కలిగిస్తున్నాయి.