ఉద్యమంగా మారుతున్న తెలంగాణా ఆర్టీసి సమ్మె...

 

ఆర్టీసి సమ్మె తీవ్ర రూపం దాల్చుతుంది,వరుస ఆత్మహత్యలతో ఉద్యమ రూపం దాల్చుతోంది. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, కండక్టర్ సురేంద్ర గౌడ్ లు ప్రాణాలు తీసుకోవటం ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఆత్మ బలి దానాలు వద్దంటూనే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయటానికి ఆర్టీసీ,జెఏసీ కొత్త కార్యాచరణకు సిధ్ధమయ్యింది. శ్రీనివాస్ రెడ్డి  ఆత్మహత్య నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్ కొనసాగుతుంది. ఆర్టీసి కార్మికులు రాత్రి డిపోల ముందు కొవ్వొత్తుల ర్యాలీలు చేశారు. ఈరోజు అన్ని డిపోల ముందు బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించారు. అర్టీసి, జేఎసి నాయకులు గవర్నర్ తమిళసాయిని కలవబోతున్నారు. ఆర్టీసి సమ్మె ఎందుకు చేపట్టారో దాని తరువాత పరిణామాలేంటి అన్న విషయాలను గవర్నర్ ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. దీంతో సమ్మె ఎటువైపు తిరుగుతోంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. 

ఆర్టీసీ,జెఏసీ కి ఇప్పటికే విపక్షాలు మద్దతు పలికాయి, ఆర్టిసి కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసి కార్మికులు చేపడుతున్న ఆంధోళన కార్యక్రమాలకు భేషరతుగా మద్దతుని ప్రకటిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని నిర్ణయించాయి. కొన్ని ప్రజా సంఘాలు, రెవెన్యూ సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతును ప్రకటించాయి. దీంతో సమ్మె కాస్తా ఉద్యమంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఆర్టీసి కార్మికులను రాజకీయ పార్టీలు రెచ్చగొడుతున్నాయని ప్రభుత్వం చెప్తుంది. ఆర్టీసి కార్మికులను తమ గుప్పెట్లోకి తీసుకుని సర్కార్ పై కుట్ర చేస్తున్నాయని మంత్రులు ఆగ్రాహాన్ని వ్యక్తం చేశారు. 

ఆర్టీసి సమ్మె నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం దసరా సెలవులను పొడిగించింది. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మరింత పెంచాలని నిర్ణయించింది. కార్మికుల ఆత్మహత్యలకు రాజకీయ శక్తులే కారణమని సర్కార్ చెప్తుంది. ఆర్టీసి కార్మికులు రాజకీయ పార్టీల ట్రాప్ లో పడ్డారంటూ తెలంగాణా ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. తమను సంప్రదించకుండానే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ళారని ఆరోపించారు, సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రిని కలిస్తే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణా ఉద్యమం తరువాత ఆర్టీసీ సంఘాలు తమతో ఎప్పుడూ కలవలేదని ప్రకటించారు. ఆర్టీసీ రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటే తాము కూడా సహకరిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో ఆర్టీసీ సమ్మెకు తెలంగాణా ఎన్జీవోలు, టిఎన్జీవోలు ప్రస్తుతానికి దూరంగా ఉంటారని అర్ధమౌతుంది. ఇదిలా ఉండగా తెలంగాణా ఆర్టీసీ సమ్మెకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసి కార్మిక సంఘాలు మద్దతుని ప్రకటించాయి, తెలంగాణా ఆర్టీసి కార్మికుల డిమాండ్ లు న్యాయమని చెప్తున్నాయి.