విశాఖ జూలో వస్తుమార్పిడి విధానం అమలు చేస్తున్న అధికారులు...

 

వస్తుమార్పిడి విధానం గురించి వినే ఉంటారు. పూర్వకాలంలో డబ్బులు లేని రోజుల్లో మన దగ్గరున్న వస్తువులిచ్చి వాళ్ళ నుండి మనకు కావలసిన వస్తువులు తీసుకునే వాళ్లం. అయితే ఇప్పుడు ఈ విధానం జంతువులకు అమలు చేస్తున్నారు విశాఖ జూ అధికారులు. సరికొత్తగా జంతు మార్పిడి విధానం తీసుకొచ్చారు, దేశంలో అతిపెద్ద జూలలో విశాఖలోని ఇందిరా గాంధీ జూ పార్క్ ఒకటి. ఆరు వందల ఇరవై ఐదు ఎకరాల్లో కొండల నడుమ సహజసిద్ధంగా ఉండే ఈ జూ ని సందర్శించే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఈ జూలో ఉండే జంతువులు, పక్షులకు ఏడాదికి ఆహారం ఖర్చు చాలా ఎక్కువ. వీటిలో టైగర్స్, లెపర్డ్, జాగ్వర్, ఏనుగు, హిప్పోపొటమస్ జంతువులకు మరింత ఖర్చవుతుంది.

వచ్చే ఆదాయంతో పోల్చితే వీటికి వెచ్చించే ఖర్చు ఎక్కువగా ఉండటంతో జంతు ప్రేమికులకు ఒక అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా జంతువులు, పక్షులను దత్తత ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక్కొక్క జంతువు, ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క రేటు ఉంది. రోజుల నుంచి ఏళ్ల వరకూ ఎన్నాళ్లు దత్తత తీసుకుంటే అన్నాళ్లూ వాటి ఆహారం ఖర్చు భరించాలి. ఇలా దత్తత తీసుకున్న వారి కుటుంబాలకు మూడు సార్లు జూలో ఎంట్రీ ఉచితం.

ఆన్ లైన్ లోనూ దత్తత తీసుకునే అవకాశం కల్పిస్తున్నామని జంతు ప్రేమికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు జూ క్యూరేటర్ యశోదబాయి. ఇప్పటికీ విశాఖ జూలో ఉన్న కొన్ని జంతువులను వివిధ ప్రాంతాల నుంచి జంతు మార్పిడి ద్వారా తీసుకువచ్చారు. వైల్డ్ డాగ్స్, వైట్ టైగర్స్ సంతతి పెరగడంతో వాటిని ఇతర జూలకు ఇచ్చి అక్కడి నుంచి వేరే జంతువులను తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే మలేషియా జూ నుంచి జిరాఫీ, ఇజ్రాయిల్ నుంచి చింపాంజీ తీసుకువచ్చారు, కలకత్తా నుంచి జీబ్రా తీసుకురానున్నారు.

జూ సహజసిద్ధంగా ఉందని జంతువులు అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు ఉందంటున్నారు పర్యాటకులు. అయితే జూ విస్తీర్ణానికి తగిన జంతువులు ఉండి ఉంటే బాగుండేదంటున్నారు మరికొందరు, సౌకర్యాలు కూడా పెంచాలని కోరుతున్నారు. జూని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటామని నైట్ సఫారీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తానికి వస్తు మార్పిడిలా జంతు మార్పిడి విధానం బాగుందంటున్నారు పర్యాటకులు.