సినీ పరిశ్రమకు ఆయువు పోసిన విజయవాడ

 

నేడు వాణిజ్య రాజధానిగా పేరు గాంచిన విజయవాడ ఒకానొకప్పుడు సినీ పరిశ్రమకి రాజధానిగా ఉండేది. సినీ నిర్మాణమంతా మద్రాసులో జరిగినప్పటికీ, వాటిని ప్రర్శించుకోవాలంటే నిర్మాతలు తప్పనిసరిగా విజయవాడలోని గాంధీ నగర్లో అడుగుపెట్టాల్సిందే.

 

ప్రసిద్ధిగాంచిన నవయుగ ఫిలిమ్స్, శ్రీ ఫిలిమ్స్ వంటి అనేక నిర్మాణ సంస్థల కార్యాలయాలన్నీ అక్కడే ఉండేవి. రాష్ట్రంలోని మొట్ట మొదటి సినిమా హాలు మారుతి టాకీస్ విజయవాడలో నిర్మించబడటం, ఆ తరువాత దుర్గాకళామండపం, లక్ష్మీ టాకీస్, సరస్వతి టాకీస్, రామా టాకీస్ వంటి డజనుకు పైగా సినిమా హాళ్ళు కూడా అక్కడే నిర్మించబడటం, పంపిణీ సంస్థలు, ఫైనాన్సర్లు కూడా అక్కడే ఉండటంతో, విజయవాడ నగరం సినీ రంగానికి రాజధానిగా దాదాపు మూడు నాలుగు దశాబ్దాలపాటు ఒక వెలుగు వెలిగింది.

 

ఆంద్రరత్న రోడ్డు, నాగేశ్వరావు పంతులుగారి వీధిలో దాదాపు డజనుపైగా సినిమా హాళ్ళు ఉండటంతో అక్కడికి ప్రేక్షకులతో బాటు సినిమా జనాలు కూడా తరచూ వస్తూనే ఉండేవారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆవీధిలో ఉండే దుర్గాకళామందిరానికి ఆనుకొని చిన్న లాడ్జీలో ఎప్పుడు బస చేస్తుండేవారు.ఇక సినీ నటుడు కృష్ణ, శోభన్ బాబు, సత్యనారాయణ, గుమ్మడి, రేలంగి వంటి ప్రసిద్ద నటులు కూడా తరచు గాంధీనగర్ లో కనబడుతూనే ఉండేవారు. శతాధిక చిత్ర నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన డా.రామా నాయుడు కూడా తన కుమారుడు సురేష్ బాబుని వెంటబెట్టుకొని తరచూ గాంధీనగర్ వస్తూనే ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం కూడా గాంధీనగరంలోనే నెలకొల్పబడటంతో నటులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్ కూడా అక్కడికి తరచూ వస్తూపోతూ ఉండేవారు.

 

అయితే ఇదంతా గత చరిత్రగా మిగిలిపోయింది. మారుతి, సరస్వతి, లక్ష్మి సినిమా హాళ్ళు కూల్చివేసి ఆ స్థానంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ లు కట్టబడటంతో, క్రమంగా ఆ ప్రాంతం వ్యాపార కార్యక్రమాలకు నెలవుగా మారిపోయింది. అయితే నేటికీ ఆంద్ర రత్న రోడ్డులో ఉన్న రామా టాకీస్, మరియు దుర్గ కళామందిర్ సినిమా హాళ్ళు ప్రేక్షకులను రంజింపజేస్తూనే ఉన్నాయి. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రమంతటా పంపిణీ దారుల కార్యాలయాలు, సినిమా హాళ్ళు ఏర్పడటంతో హైదరాబాద్ కేంద్రంగా సినీ పరిశ్రమ దశదిశలా విస్తరించింది.