వేడెక్కిన ఏపీ అసెంబ్లీ... 'బ్యాడ్ మార్నింగ్'తో స్పీకర్ కి స్వాగతం

ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. అనంతరం వికేంద్రీకరణ బిల్లుపై చర్చను మంత్రి బుగ్గన ప్రారంభించారు. 

బుగ్గన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో రాజమహల్ వంటి భవనాలు అవసరం లేదు. ప్రజలెవరూ రాజభవనాలు కోరుకోవట్లేదు. ప్రజలకు కావాల్సింది వసతులు, భద్రత అని అన్నారు. ఇది చారిత్రాత్మక బిల్లు. అమరావతిలోనే లెజిస్లేటివ్ రాజధాని, విశాఖలో రాజ్‌భవన్‌, సచివాలయం. కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని. పరిపాలన అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ బిల్లు.' అని బుగ్గన తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే ఆయన ప్రసంగం కొనసాగింది. 

మరోవైపు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన వెంటనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సభలోకి స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రవేశించిన వెంటనే 'బ్యాడ్ మార్నింగ్ సార్' అని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ... 'ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పి, మంచి జరగాలని కోరుకుంటారు కానీ.. ఇలా బ్యాడ్ మార్నింగ్ చెప్పేవారి గురించి ఏం మాట్లాడగలం' అని ఎద్దేవా చేశారు.