పోలవరంపై మేఘా ఐటీ రైడ్స్ ఎఫెక్ట్... ఈడీ కూడా ఎంటరైతే పరిస్థితేంటి?

మేఘా ఇంజనీరింగ్ కంపెనీపై పెద్దఎత్తున ఐటీ దాడులు జరగడం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు అకస్మాత్తుగా వచ్చి నాలుగైదు రోజులపాటు మేఘా కార్యాలయాల్లోనూ, మేఘా ఫ్యామిలీ నివాసాల్లోనూ రోజుల తరబడి సోదాలు చేయడం సాదాసీదా విషయం కాదంటున్నారు. పైగా ఐటీ దాడుల సమయంలో కేంద్ర బలగాలను వినియోగించడం చూస్తుంటే మేఘా చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే చెప్పాలంటున్నారు. మేఘాలో ఐటీ దాడులు సాధారణంగా కనిపించడం లేదని, కనీసం హైదరాబాద్ లోని ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా... ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చి తనిఖీలు చేయడమంటే ఎఫెక్ట్ భారీగా ఉండొచ్చని కార్పొరేట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఐటీ దాడుల్లో దొరికిన పత్రాలు, ఆధారాలపై అనేక రకాల వదంతులు బయటికొచ్చినా అధికారుల నుంచి మాత్రం అధికారిక సమాచారం రాలేదు.

అయితే, మేఘా కృష్ణారెడ్డికి... తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారం ఉంది. అందుకే, తెలుగు రాష్ట్రాల్లో మేఘా కంపెనీ చేపడుతోన్న ప్రాజెక్టులపైనా ఆ ప్రభావం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా రివర్స్ టెండరింగ్ లో సింగిల్ బిడ్డర్ గా నిలిచి మేఘా కంపెనీ పోలవరం కాంట్రాక్టును దక్కించుకోవడంతో... ఆ ప్రాజెక్టు భవిష్యత్ ఏంటనే చర్చ జరుగుతోంది. మేఘా కంపెనీపై కేవలం ఐటీ దాడులతోనే ఆగదని, ఈడీ కూడా దృష్టిపెట్టే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈడీ కూడా మేఘాపై దృష్టిపెడితే పోలవరం ప్రాజెక్టు పనులు చిక్కుల్లోనే పడినట్లేనన్న టాక్ వినిపిస్తుంది. జగన్ ప్రభుత్వం... నవంబర్ నుంచి పోలవరం పనులు చేపడతామని చెబుతున్న నేపథ్యంలో.... ఒకవైపు మేఘాపై ఐటీ దాడులు... మరోవైపు కోర్టు కేసులు... అడ్డంకిగా మారడం ఖాయమంటున్నారు. మొత్తానికి మేఘాపై ఐటీ దాడుల ఎఫెక్ట్... కచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పనులపై పడటం ఖాయమంటున్నారు.