ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె

 

తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ వైద్యుల సమ్మె వేడి కోర్టు ఆదేశం తర్వాత కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జూనియర్ వైద్యులు సమ్మె ప్రారంభించారు. జూనియర్ వైద్యులు అత్యవసర సేవలు మినహా అన్ని వైద్య సేవలను నిలిపివేశారు. ఈ సమ్మె మీద ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. హైకోర్టు తీర్పు ప్రకారం జూనియర్ డాక్టర్లతో చర్చిద్దామన్నా అంగీకరించలేదని తెలిపారు. జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో హైకోర్టు తీర్పు తనకు అందలేదని, అందిన తర్వాత అందులో పొందుపరిచిన అంశాలను ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు మూడు నెలలుగా సమ్మె చేసి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జూనియర్ డాక్టర్ల నాయకుడికి గతంలోనే వైద్య విద్య పూర్తయిందని, అతనికి సర్టిఫికెట్లు అందలేదని తన సొంత సమస్యను వైద్య విద్యార్థులందరి మీద రుద్దడం సరికాదని అన్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మెను ప్రజలు సమ్మతించరని అన్నారు. సమ్మె వల్ల రోగులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.