బాబును మించిపోతున్న వైఎస్ జగన్!

ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా లోటులో ఉన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో బ్యాంకుల నుంచి అప్పులు తేవడం జరుగుతుంది. సహజంగా ప్రభుత్వ అవసరాలకు అప్పులు తీసుకు రావడం మామూలే. ఆయా కార్పొరేషన్ ల ఆస్తులను తనఖా పెట్టి మరీ తెచ్చిన రుణ మొత్తాలను జగన్ ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించేస్తున్నారు. అదేమంటే.. ప్రభుత్వ కార్పొరేషన్ ల ద్వారా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని వాటిని ప్రభుత్వ అవసరాలకు మళ్లించడంలో వైఎస్ జగన్ సర్కార్ గత ప్రభుత్వాన్ని మించిపోయింది. గత సర్కారు చివరి సంవత్సరంలో కార్పొరేషన్ ల అప్పులు భారీగా తీసుకురాగ, జగన్ ప్రభుత్వం తొలి ఏడాది నుంచే ఈ తరహా మళ్లింపులో ఆరి తేరింది.

అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పౌరసరఫరాల సంస్థ, గృహ నిర్మాణ సంస్థ, ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ నుంచి జనవరి వరకు ఇలా 12 వేల కోట్ల రూపాయల వరకు అప్పుగా తెచ్చిన మొత్తాన్ని సదరు కార్పొరేషన్ల కోసమే వినియోగించారా? లేక ప్రభుత్వ అవసరాలకు మళ్లించారా? అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. ఈ అప్పులేమీ ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం పరిధిలోకి రాకపోవడంతో ఎక్కడ దొరికితే అక్కడ ఎడా పెడా దూసుకొస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 1.14 లక్షల కోట్ల ఆదాయం రాగా ఇందులో 90% శాతం మొత్తానికి ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చి అప్పులు తెచ్చుకోవచ్చు అని సమాచారం.

అంతేకాకుండా ఆర్థిక శాఖ ఏప్రిల్ నుంచి జనవరి వరకు 16 వేల కోట్ల రూపాయల అప్పులకు గ్యారెంటీ ఇచ్చింది. ఇందులో జనవరి నాటికి 12 వేల కోట్లు రుణంగా తెచ్చారు. పీఎఫ్సీ నుంచి మొత్తం 9వేల కోట్ల అప్పు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకు వీలుగా పలు జిల్లాల్లో ఏపీ జెన్ కో భూములనూ కొన్ని ప్రాజెక్టులను ఆ కార్పొరేషన్ కు బదిలీ చేశారు. బ్యాంకుల వద్ద ఈ ఆస్తులను తనఖా పెట్టి భారీ మొత్తంలో అప్పులు తెస్తున్నారు. పీఎఫ్సీ నుంచి లక్ష్యంగా పెట్టుకున్న 9 వేల కోట్లలో ఇప్పటికే 5,500 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకోగా ఇంకో రూ. 3500 కోట్లు రావాల్సి ఉంది. ఎస్బిఐ అలహాబాద్ బ్యాంకులో నుంచి పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ.3 వేల కోట్ల రూపాయిల అప్పు తెచ్చారు. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రూ.1800 కోట్ల రూపాయల రుణాలు తెచ్చారు. మిగతా కార్పొరేషన్ ల నుంచి కొద్దికొద్దిగా 1,700 ల కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చారు. ఈ మొత్తం 12 వేల కోట్లకు చేరుకుంది. జెన్ కో ద్వారా మరో 2,500 ల కోట్ల రూపాయల రుణం తేవటానికి సంప్రదింపులు జరుగుతున్నాయి. మొత్తానికి చూసుకుంటే గత ప్రభుత్వం కంటే జగన్ సర్కార్ రుణాలను ఎక్కువగా తీసుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.