ఏపీ ఉగాది వేడుకలు ఎక్కడంటే...

 

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంత గ్రామమైన తుళ్ళూరులో ఈసారి ఉగాది వేడుకలను వైభవంగా జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమై దాదాపు ఏడు గంటలపాటు సాగింది. బడ్జెట్‌లో రాష్ట్రానికి తక్కువ కేటాయింపులు జరపడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలా లేక కొంతకాలం వేచి చూడాలా ఈ నేపథ్యంలో ప్రధానిని కలవాలా అనే అంశాల మీద ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

 

ఉగాది వేడుకలను కొత్త రాజధాని గ్రామం తుళ్ళూరులో జరపాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ఉగాది సందర్భంగా తుళ్ళూరులో రైతుల అభినందన సభ జరపాలని కూడా నిర్ణయించారు. పశుగ్రాసం కిలో మూడు రూపాయలకే అందించాలని, ఎస్సీ, ఎస్టీయేతర రైతులకు తుంపర, బిందుసేద్యం పరికరాలపై రాయితీని 2 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల మీద అసంతృప్తి విషయాన్ని గురువారం మరోసారి సమావేశమై చర్చించాలని నిర్ణయించారు.

 

బుధవారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖల వారీగా మంత్రులతో సమీక్ష జరిపారు. ఈనెల 6న ఆయన మంత్రులతో మరోసారి సమావేశాన్ని నిర్వహించనున్నారు. 6న సమావేశంలో శాసనసభ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించనున్నారు. రెండోదశ రుణ మాఫీ ఈ నెలలో పూర్తి చేసే విషయం మంత్రివర్గం చర్చించింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యోగుల సమ్మెకాలాన్ని ప్రత్యేక కాజువల్ లీవుగా పరిగణించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంచాయితీల్లో వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు 40 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి రేషన్ బియ్యం కోటాను ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది.