రాజధాని భూసేకరణకు నేడు రైతులకు నోటీసులు

 

రాజధాని కోసం భూసమీకరణ 98శాతం పూర్తయ్యింది. కానీ మిగిలిన రెండు శాతం భూసేకరణకి నాలుగయిదు గ్రామాలలో రైతులు అంగీకరించకపోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో వారికీ భూసేకరణ చట్టం క్రింద నోటీసులు ఇచ్చి భూమిని స్వాధీనం చేసుకోవలసి వస్తోంది. ఇంకా 2200 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అందులో 700 ఎకరాల సేకరణకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత రైతులకు నోటీసులు ఇవ్వబోతున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మిగిలిన 1,500 ఎకరాల భూసేకరణకు కూడా మరొక్క వారం రోజుల్లోగానే నోటీసులు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. కనుక ఇక ఈ వ్యవహారానికి ఇంతటితో ముగింపు పలకడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లే భావించవచ్చును. మరి దీనిపై ఆ రైతులు, ప్రతిపక్షాలు, ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ తను రాజధాని గ్రామాలలో రైతులను త్వరలోనే కలుస్తానని నిన్న ట్వీటర్లో ఒక మెసేజ్ పెట్టారు. ఏమయినప్పటికీ భూసేకరణలో ఈ ఆఖరిఘట్టంలో కొంత యుద్ద వాతావరణం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.