జగన్‌కు మరోసారి షాకిచ్చిన షా..! ఢిల్లీ టూర్‌లో మళ్లీ చేదు అనుభవం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి ఢిల్లీలో చుక్కెదురైనట్లు ప్రచారం జరుగుతోంది. ముందుగానే అపాయింట్ మెంట్ తీసుకుని ఢిల్లీ వెళ్లినా... తీరా అక్కడికి వెళ్లాక... కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఝలక్ ఇచ్చారని అంటున్నారు. అమిత్ షాను కలిసేందుకు గురువారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన జగన్... రెండ్రోజులు వేచిచూసినా... కేంద్ర హోంమంత్రి సమయం ఇవ్వకపోవడంతో... తిరిగి అదే ఫ్లైట్ లో తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. అయితే, ముందుగా అపాయింట్ మెంట్ ఇచ్చినా... ఢిల్లీ వచ్చాక అమిత్ షా ఎందుకు ముఖం చాటేశారనేది చర్చనీయాంశంగా మారింది. ఇలా జరగడం ఇది మొదటిసారి కాదని, గతంలోనూ ఒకసారి ఇలాగే ప్రవర్తించారని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీభవన్ వర్గాల సమాచారం మేరకు గురువారం రాత్రి పది గంటలకు అపాయింట్ మెంట్ ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.... చివరికి శుక్రవారం కూడా తనను కలవడానికి జగన్ కు టైమివ్వలేదు

ముందుగా అపాయింట్ మెంట్ ఇచ్చి... తీరా వచ్చాక జగన్ కు అమిత్ షా సమయం ఇవ్వకపోవడం... వైసీపీ ఎంపీల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. జగన్ పట్ల కేంద్రం ఎందుకిలా వ్యవహరిస్తుందో అంతుపట్టడం లేదని అంటున్నారు. అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే అసలు వచ్చేవారే కాదని, కానీ అపాయింట్ మెంట్ ఇచ్చాక కలవకపోవడం ముఖ్యమంత్రిని అవమానించడమేనని వ్యాఖ్యానిస్తున్నారు. గురువారం రోజు జగన్ కు సమయం ఇవ్వని అమిత్ షా.... వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఎంపీ సీఎం రమేష్, జితేందర్ రెడ్డి లాంటి పలువురు నేతలకు మాత్రం సమయం ఇవ్వడంలో మర్మమేమిటో అంతుచిక్కడం లేదని అంటున్నారు. గతంలో కూడా అమిత్ షా ఇలాగే చేశారని... అపాయింట్ మెంట్ తీసుకుని ఢిల్లీ వచ్చిన జగన్ కు సమయం ఇవ్వలేదని... రోజుల తరబడి నిరీక్షించేలా చేశారని గుర్తుచేస్తున్నారు. 

అయితే, ముందుగా అపాయింట్ మెంట్ ఇచ్చి... తీరా ఢిల్లీ వచ్చాక కలవకపోవడం వెనుక ఏదో మతలబు ఉందని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారు. జగన్ కు ఏదో మెసేజ్ పంపేందుకే అమిత్ షా ఇలా వ్యవహరిస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. షా ఒక్కరే కాదు ఇతర కేంద్ర మంత్రులు కూడా గతంలో ముందుగా అపాయింట్ మెంట్ ఇచ్చి... ఆ తర్వాత కలవలేదనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మరి, అమిత్ షా ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో... జగన్ ను ఢిల్లీకి పిలిచిమరీ ఎందుకు సమయం ఇవ్వడం లేదో... తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.