రుణాల ఎగవేత కేసులో రాయపాటి ఆస్తుల వేలం ప్రకటన.. ఓ వృథా ప్రయత్నం!

837.37కోట్ల రూపాయల రుణం ఎగవేత కేసులో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు ఆంధ్రాబ్యాంక్ తాజాగా బహిరంగ ప్రకటన జారీ చేసింది. వచ్చే నెల 23న వేలం నిర్వహించనున్నట్లు ఆంధ్రాబ్యాంక్ ఈ ప్రకటనలో పేర్కొంది. అంతవరకూ బాగానే ఉన్నా రాయపాటి తనఖా పెట్టిన ఆస్తుల విలువ, ఆయన ఎగవేసిన రుణం విలువ తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం. రాయపాటి సాంబశివరావు ప్రమోటర్ గా ఉన్న ట్రాన్స్ ట్రాయ్ ఇండియాతో పాటు రాయపాటి రంగారావు, చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, దేవికారాణి, లక్ష్మి పేరిట తీసుకున్న రుణం విలువ 837 కోట్లయితే ఆయన ఇందుకోసం తనఖా పెట్టిన ఆస్తుల విలువ కేవలం 17.5 కోట్లు మాత్రమే. ఇందులో గుంటూరులో ఉన్న భవనం విలువ 16.44 కోట్లు కాగా.. ఢిల్లీలోని ఫ్లాట్ విలువ 1.09 కోట్లుగా బ్యాంకు నిర్ధారించింది. అంటే దీన్ని బట్టి ఈ వేలం నిర్వహణ ద్వారా బ్యాంకుకు ఒనగూరే ప్రయోజనం విలువ తీసుకున్న రుణంలో కేవలం రెండుశాతం మాత్రమే.

ఈ రుణానికి హామీ దారులుగా ఉన్నది రాయపాటి జగదీష్, రాయపాటి జీవన్, నారయ్య చౌదరి, రాయపాటి రంగారావు, దేవికారాణి, లక్ష్మి, సీహెచ్ వాణి, యలమంచిలి జగన్ మోహన్. వీరందరి ఆస్తులను ఒకేసారి వేలం వేయకుండా కేవలం రాయపాటి పేరు మీద ఉన్న ఆస్తులను మాత్రమే వేలం వేస్తున్నారంటే పరిస్ధితి అర్ధమవుతోంది. వాస్తవానికి 2014 కంటే ముందు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అప్పట్లో ఆయన కున్న పరపతితోనే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును ఆయన ప్రమోటర్ గా ఉన్న ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ దక్కించుకోగలిగింది. అయితే అప్పటికే ఆర్ధిక ఇబ్బందుల‌్లో ఉన్న ట్రాన్స్ ట్రాయ్ ఆ తర్వాత దివాలా తీసింది. పోలవరం పనులు పూర్తి చేయలేక చేతులెత్తేయడంతో నవయుగ ఇంజనీరింగ్ కు అప్పటి టీడీపీ సర్కారు పనులు అప్పగించింది. పోలవరం ప్రాజెక్టులో పని చేయకుండానే ఆయన ట్రాన్స్ ట్రాయ్ క్లెయిమ్ చేసిన మొత్తాన్ని చెల్లించి మరీ నవయుగతో అప్పటి ప్రభుత్వం ఒప్పందం కుదిర్చి రాయపాటిని ఒడ్డున పడేసింది. అయితే దివాలా నోటీసు నేపథ్యంలో బ్యాంకులు ఒక్కొక్కటిగా ఆయన ఆస్తులను వేలం వేయడం ద్వారా రుణాల వసూలుకు ప్రయత్నిస్తున్నాయి.

రుణాలు ఎగవేసిన బడా బాబుల వ్యవహారంలో బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే పలు విమర్శలు ఉన్నాయి. వారికి ఇచ్చే రుణాలకూ, తనఖా పెట్టే ఆస్తులకూ ఎక్కడా పొంతనం ఉండటం లేదు. ఇదే రుణాల ఎగవేతకు కారణమవుతోంది. కేవలం వ్యక్తులకు సమాజంలో ఉన్న పరపతి, రాజకీయంగా వారి పదవులను చూసి భారీగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఇప్పటికే దివాలా తీస్తున్నాయి. అయినా వాటి వైఖరిలో మార్పు రావడం లేదు. కోట్లాది రూపాయలు నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) రూపంలో పేరుకుపోతున్నా కనీసం ఎగవేతదారుల ఆస్తులను పూర్తిస్దాయిలో వేలం కూడా వేసే పరిస్ధితి లేదు. ప్రస్తుతం రాయపాటి సాంబశివరావు ఆస్తుల వేలం వ్యవహారంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది.