తెలంగాణాలో మొట్ట మొదటి ప్రభుత్వం ఎవరిది

 

రాష్ట్ర విభజన ప్రక్రియ ఎటువంటి అవరోధాలు లేకుండా సజావుగా సాగితే డిశంబర్ నెలనాటికి పూర్తవుతుందని భావించవచ్చును. అప్పటికి సాధారణ ఎన్నికలు జరగడానికి ఇంకా మూడు లేదా నాలుగు నెలల సమయం మిగిలి ఉంటుంది. సాంకేతికంగా విభజన ప్రక్రియ పూర్తయితే, ఇక రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కొలువు తీరవలసి ఉంటుంది. కానీ, అది మరిన్నికొత్త చిక్కు సమస్యలను తెచ్చేఅవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావించి విభజన ప్రక్రియను వ్యూహాత్మకంగా జాప్యం చేసినా లేక అనివార్య కారణాల వలన జాప్యం జరిగినా అప్పుడు ఎన్నికల వరకు రెండు రాష్ట్రాలను కేంద్రం తన అధీనంలోకి తీసుకొనే అవకాశం ఉంది. అయితే ఎన్నికలు మాత్రం రెండు రాష్ట్రాలలో వేరు వేరుగా జరగవలసి ఉంటుంది గనుక ప్రస్తుతం అధికారంలో ఉన్నకాంగ్రెస్ ప్రభుత్వం రెండు చోట్ల వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

 

అదే జరిగితే తెలంగాణాలో ఉన్న119మంది శాసన సభ్యులలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 40మంది వరకు సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పరచడానికి కనీసం 79 సభ్యులు అవసరం ఉంటారు. ఇప్పటికే మజ్లిస్ తన 9 మంది సభ్యులతో కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెరాస కనుక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఆ పార్టీకి చెందిన 19 మంది శాసన సభ్యులు కలిస్తే మొత్తం 68మంది అవుతారు. ఒకవేళ తెరాస విలీనానికి ఇష్టపడకపోతే అప్పుడు ఆ పార్టీ మద్దతు కోరే అవకాశం ఉంది. విలీనం జరిగినా జరగకపోయినా ఈలోగానే దాదాపు 6 నుండి 8 మంది తెరాస శాసన సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ తెరాస కాంగ్రెస్ లో విలీనానికి ఇష్టపడకపోతే మరి కొంత మంది ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే అప్పుడు తెరాసలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే మిగులుతారు గనుక ‘తెరాస ప్రైవేట్ లిమిటడ్’ అని బోర్డు పెట్టుకోక తప్పదు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకి స్వతంత్ర అభ్యర్ధుల మద్దతు కూడా లభిస్తుంది. ఇంకా తప్పనిసరి పరిస్థితిలో, తెదేపా సభ్యులకు కూడా వలవిసిరినా ఆశ్చర్యం లేదు.

 

ఎన్నికలకి కేవలం మూడు నాలుగు నెలల వ్యవధిలో కొత్త ప్రభుత్వం సాధించేదేమీ ఉండకపోయినా, ఎన్నికల ముందు అధికారంలో ఉండటం వలన చాలా లాభాలు ఉంటాయి. అధికార పార్టీగా ఎన్నికలలో పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకొనే విధంగా చేయడానికి ఆ కొద్ది సమయం చాలా ఉపయోగపడుతుంది. గనుక కాంగ్రెస్ రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేయడం ఖాయం.