ఎవరు డబుల్ గేమ్ ఆడుతున్నారు

 

రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సగం మంది ప్రత్యేక తెలంగాణా కోసం, మరి కొంత మంది సమైక్యాంధ్ర అంటూ మాట్లాడుతుంటే, కేంద్ర మంత్రి పదవులు పుచ్చుకొన్న మరి కొంతమంది తాము అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నమంటూనే, రాష్ట్ర విభజన పట్ల తమ అభిప్రాయంలో ఎటువంటి మార్పు లేదని చెపుతున్నారు. వారు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెపుతుంటే, వారి అనుచరులు మాత్రం సమైక్యాంధ్ర అంటూ సభలు సమావేశాలు నిర్వహించడం కూడా బహిరంగ రహస్యమే. అంటే కాంగ్రెస్ పార్టీలోనే నాలుగు రకాల వాదనలు చేస్తున్నవారున్నారన్నమాట.

 

అయితే, నెల్లూరు కాంగ్రెస్ శాసన సభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ముఖ్యంగా వైకాపానేతలు ఈ విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. విజయమ్మ ఆదేశాల మేరకే ఆ పార్టీ శాసన సభ్యులు రాజీనామా డ్రామా ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.

 

ఒకవైపు ఆయన ప్రతిపక్షాలను నిందిస్తూనే, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగదని, తెలంగాణా మ్యాపులు వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదని ఆయన స్పష్టం చేసారు. అయితే, మరి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ రోడ్డు మ్యాపులు తయారు చేయమని ముఖ్యమంత్రిని, పీసీసీ అధ్యక్షున్ని, ఉప ముఖ్యమంత్రిని ఎందుకు కోరినట్లు? అది ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆనం వారి అభిప్రాయమా? అదే నిజమయితే మరి డబుల్ గేమ్ ఆడుతున్నధి కాంగ్రెస్ పార్టీనా లేక ప్రతిపక్షాలా? ఆయనే వివరిస్తే బాగుంటుంది కదా?