ఆనం వారి నీతి ప్రవచనాలు

 

వైయస్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు వెలివేయాలని, జగన్ను ఉరి తీయాలని తీర్మానం చేసిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి మళ్ళీ నోరు విప్పారు. నేరారోపణ ఎదుర్కొంటున్న మంత్రులు కేవలం మాజీ ముఖ్యమంత్రి డా. రాజశేఖర్ రెడ్డి ఆదేశాలను పాటించారు తప్పఏ నేరంలోను స్వయంగా పాలుపంచుకోలేదు. ఆయన తీసుకొన్న నిర్ణయాలతో ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి లబ్ది పొందారు తప్ప మంత్రులెవరూ కూడా వ్యక్తిగతంగా లబ్ది పొందలేదు. కనుక, వారినెవరినీ తప్పు పట్టలేమని ఆయన శలవిచ్చారు. అయితే, వారివల్ల తప్పు జరిగింది గనుక, వారి విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకొన్న ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు.

 

ఇక, తమ పార్టీ నుండి ఇంకా ఎంత మందిని వైయస్సార్ పార్టీ ఆకర్షించి తీసుకు వెళ్ళగలదో దయచేసి వెంటనే అందరినీ తీసుకు వెళ్ళిపోమని, అటువంటి నిలకడలేని మనస్తత్వం కలవారు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదని ఆయన అన్నారు. నీతి నిబద్ధత, పార్టీ సిద్ధాంతాల పట్ల అభిమానం ఉన్నవారు మాత్రమే తమ పార్టీకి అవసరం తప్ప నిలకడలేని అటువంటివారు తమకు అవరసరం లేదని ఆయన ఆన్నారు.

 

ఆనం వారు గతంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ప్రత్యేక సమావేశం పెట్టి అటువంటి మహానుభావుడిని కోల్పోయిన రాష్ట్ర ప్రజలు అనాధలుగా మారిపోయారని, పుట్టెడు దుఃఖంలో ఉన్నపటికీ దిక్కులేక విలవిలలాడుతున్నప్రజలను ఆదుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి ముందుకు వచ్చాడని, ఆయన లేకపోతే రాష్ట్రం ఏమయిపోతుందో? అని వల వల ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకొన్న ఆనం వారు, నేడు ఈ విధంగా రాజకీయాలలో నీతి, నిజాయితీ, నిబద్ధత, పార్టీ సిద్ధాంతాలు విలువలు అని మాట్లాడుతుంటే వైకాపానేతలే కాదు ఆయన మాటలు విన్న ప్రజలు కూడా నవ్వుకొంటున్నారు.

 

అయినా రాజకీయాలలో ఈవిధంగా రంగులు మార్చలేని వారు మనుగడ సాగించడం చాలా కష్టమే, కనుక ప్రజలే కొంచెం విశాల హృదయంతో వారిని అర్ధం చేసుకోక తప్పదు.