ఆదాల వర్సెస్ ఆనం.. ఈసారి పార్లమెంటు బరిలో?

 

ఒకే పార్టీలో ఉన్నా కూడా వైరి వర్గాలుగా ఎప్పటికప్పుడు తమ ఆధిపత్యాన్ని చూపించుకోడానికి ప్రయత్నించిన చరిత్ర ఆనం, ఆదాల వర్గాలకు ఉంది. నెల్లూరు జిల్లాలో ఆనం చెంచుసుబ్బారెడ్డి వారసులుగా ఈ తరంలో రాజకీయాలు నడిపిస్తున్న ఆనం సోదరుల్లో పెద్దవాడు, నిన్న మొన్నటి వరకు సమైక్య రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఆనం రామనారాయణ రెడ్డి ఈసారి లోక్ సభ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయానికి కారణం ఆయన చిరకాల ప్రత్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డేనని తెలుస్తోంది.

 

ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, తెలుగుదేశం పార్టీలో చేరిన ఆదాల.. నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన ఆనం.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఆదాలను ఢీకొట్టాలని భావిస్తున్నారట. అయితే, అంతకుముందు వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీలో కొనసాగుతున్న మేకపాటి రాజమోహనరెడ్డి ప్రస్తుతం నెల్లూరు ఎంపీ. ఆయన ఈసారి కూడా అదే పార్టీ తరఫున బరిలోకి దిగడం ఖాయం.

 

ఈ నేపథ్యంలో.. ఒకే పార్టీ నుంచి వచ్చిన ముగ్గురు నాయకులు మూడు వేర్వేరు పార్టీల నుంచి నెల్లూరు లోక్ సభ స్థానాన్ని చేజిక్కించుకోడానికి పందెం కోళ్లలా పోరాడబోతున్నారన్న మాట.