అమూల్యపై యడియూరప్ప సంచలన ఆరోపణలు... దేశ ద్రోహం కింద కేసు-14రోజుల రిమాండ్

సీఏఏకు వ్యతిరేకంగా బెంగళూరు సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసిన అమూల్య వ్యవహారం ముదురుతోంది. ఐపీసీ సెక్షన్ 124ఏ కింద అమూల్యపై దేశద్రోహం కేసు పెట్టడంతో పాటు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపైనా చర్యలు తీసుకునే దిశగా కర్నాటక ప్రభుత్వం యోచిస్తోంది.

పాకిస్తాన్ జిందాబాద్ అంటూ బెంగళూరు సభలో నినాదాలు చేసిన అమూల్యకు గతంలో మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలుండేవని కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఆరోపించారు. అమూల్య వెనుక కొన్ని శక్తులు పనిచేస్తూ, అలాంటివారిని పెంచి పోషిస్తున్నాయని, వాటికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోకపోతే మరోసారి ఇలాంటి ఘటనలు రిపీటవుతూనే ఉంటాయని యడియూరప్ప అభిప్రాయపడ్డారు. అమూల్య వెనుక మావోయిస్టులు ఉన్నారేమోనన్న కోణంలో విచారించాలని, అప్పుడే అన్ని విషయాలు బయటపడతాయని అన్నారు.

సీఏఏకు వ్యతిరేకంగా బెంగళూరులో నిర్వహించిన సభలో అమూల్య పాకిస్థాన్‌ అనుకూలంగా నినాదాలు చేసింది. అమూల్య వ్యాఖ్యలకు షాకైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ... మైక్‌ లాక్కుందామని ప్రయత్నించినా, ఆమె వదలకుండా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. దాంతో, అమూల్య బెయిలు కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయమూర్తి నిరాకరించారు. 14రోజులపాటు  జ్యుడీషియల్‌ కస్టడీకి తీసుకోవాలని ఆదేశించారు. దాంతో, అమూల్య చిక్కుల్లో పడింది.