మరో ముఖ్య నిర్ణయానికి నాంది పలకనున్న బీజేపీ సర్కార్...

ఆరు దశాబ్దాల పౌరసత్వ చట్టంలో సవరణలకు రంగం సిద్ధమైంది. పౌరసత్వ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. నేడు చర్చించి బిల్లుకు ఆమోదం తెలపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ బిల్లు ఆమోదం పొందితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ లో మత పీడనకు గురై అక్కడి నుంచి భారత్ కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఆ 3 దేశాల నుంచి 2014 డిసెంబర్ 31 వ తేదిలోపు వచ్చినా హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను అక్రమ వలసదారులుగా పరిగణించి వారికి భారత పౌరసత్వం కూడా ఇవ్వనున్నారు. గతంలో 11 ఏళ్ల పాటు దేశంలో ఉంటేనే పౌరుసత్వం ఇచ్చేవారు. సవరణ చట్టంలో దానిని 5 ఏళ్లకు కుదించారు. అక్రమ వలసదారులుగా వారి పై నమోదైన కేసులను కూడా ఎత్తి వేయాలని బిల్లులో పేర్కొన్నారు. కేసులు ఉన్నాయన్న కారణంగా పౌరసత్వాన్ని నిరాకరించడానికి లేదని స్పష్టం చేశారు. అయితే ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమవుతోంది. బిల్లును వ్యతిరేకిస్తూ వివిధ సంఘాలు పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. సవరణ చట్టం 1985 లో కుదిరిన అస్సాం ఒప్పందాన్ని నిర్వీర్యం చేస్తుందని స్పష్టం చేస్తున్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో శక్తిమంతమైన నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రేపు 11 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. అక్రమంగా వచ్చిన శరణార్థులను శాశ్వత నివాసులుగా పరిగణిస్తే ఈ ప్రాంత జనాభా వివరాలలో మార్పులు వస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యం లోనే ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనలకు భరోసా ఇచ్చేలా సవరణ చట్టంలో కేంద్రం నిబంధన విధించింది. ఈ సవరణ చట్టం అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర లోని గిరిజన ప్రాంతాలకు వర్తించదని అవి యిప్పటికే రాజ్యాంగంలోని 6 వ షెడ్యూల్ ఉన్నాయని తెలియజేసింది. అలాగే ఇన్నర్ లైన్ పర్మిట్ అమల్లో ఉన్న ప్రాంతాలకు కూడా ఈ చట్టం అమలు కాదని వివరించింది.