అమిత్ షా vs రాహుల్.. జార్ఖండ్ లో వేడెక్కిన రాజకీయం

 

జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఒక వైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మరో వైపు రాహుల్ గాంధీ మాటల తూటాలు పేల్చుతున్నారు. రెండో దశ ఎన్నికల ప్రచారం సందర్భంగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ నెల ( డిసెంబర్ ) 7వ తేదీన రెండో దశ పోలింగ్ జరుగుతుంది. దీంతో జంషెడ్ పూర్ లో జరిగిన సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య తీర్పు ఆలస్యం కావటానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు అమిత్ షా. మరోవైపు దేశంలో హాట్ టాపిక్ గా మారిన ఎన్ఆర్సీ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. 2024 లోక్ సభ ఎన్నికల నాటికి దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో చొరబడ్డ విదేశీయులను తరిమేస్తామని తెలిపారు అమిత్ షా. కాంగ్రెస్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎన్ఆర్సీ ని అమలు చేస్తామంటే రాహుల్ గాంధీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు అమిత్ షా. 

మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తొలిసారి జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సిండోకాతో పాటు జంషెడ్ పూర్ ఎన్నికల సభలో రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఎవరినీ భయపెట్టే రాజకీయాలు చేయదన్నారు రాహుల్. జార్ఖండ్ ప్రజల్నీ బిజెపి భయబ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. ఆదివాసీల నుంచి విలువైన భూములు లాక్కుని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని రాహుల్ విమర్శించారు. మొత్తం మీద రెండో దశ పోలింగ్ కు 5 రోజుల ముందే జార్ఖండ్ లో ప్రచారం హీటెక్కింది. ప్రధాన పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రచారం హాట్ హాట్ గా సాగుతోంది.