అనుకున్నదొకటి అయిందొకటి.. రాజధాని తరలింపుతో వాళ్ళెంత నష్టపోయారు?

“చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవా” అన్న సామెత అందరికీ తెలిసిందే..అచ్చు అలానే ఉంది కొందరి పరిస్థితి. మింగలేక కక్కలేక అన్నట్లుంది వారి స్థితి. పైకి చెప్పలేరు లోపల దాచుకోనూలేక సతమతం అవుతున్నారు. ఇంతకీ వీరెవరు అనుకుంటున్నారా? రాజధాని గ్రామాల ప్రజలు.. ఆ ప్రజల్లో కూడా 15 వేల కుటుంబాలు.. ఈ 15 వేల కుటుంబాల ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా? వీరంతా రెడ్లు..

అమరావతి నుంచి రాజధాని తరలిపోతే వీరంతా అక్కడ ఒక్క రోజు కూడా ఉండలేరు. జీవనోపాధి కోసం బయటకు వెళ్లాల్సిందే. ఏం చేయాలో అర్ధం కాక రెడ్లంతా జుట్టుపీక్కుంటున్నారు. పైకి విమర్శించలేరు. ఊరుకోనూ లేరు. అలా అని రాజధాని ఉద్యమంలో పాలుపంచుకోనూ లేరు..పాపం.

అసలేం జరిగిందో చూద్దాం..

ఈ కుటుంబాలు రాజధాని గ్రామాలలో తరతరాలుగా ఉంటున్నారు. వీరిలో చాలా మందికి ఇక్కడ ఎకరం నుంచి 20 ఎకరాల వరకూ భూములు ఉన్నాయి. ఇంతకాలం పంటలు పండించుకుంటూ సంతోషంగా ఉండేవారు. ఈ ప్రాంతానికి రాజధాని వస్తుందని వారు కూడా అనుకోలేదు. రాష్ట్ర విడిపోవడం రాజధాని రావడం జరిగిపోయింది.

రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ లో ఈ 15 వేల కుటుంబాలూ పాలు పంచుకున్నాయి. కొందరు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మరికొందరు అన్ని బేరీజు వేసుకుని చివరిలో ఇచ్చారు. మరి కొందరు సగం భూమి అమ్ముకున్నారు.. సగం ఉంచుకున్నారు. ఎప్పుడైతే రాజధాని వచ్చేసి భూముల విలువ పెరిగిందో అప్పటికే రాజధాని కోసం భూములు ఇచ్చిన ఈ 15 వేల కుటుంబాలలోని వారు చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా మారిపోయారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే ఏదో కోట్ల రూపాయల టర్నోవర్ చేసేంత కాదు. తమకు పరిచయం ఉన్నవారి భూములు అమ్మిపెట్టడం, తమకు తెలిసిన వారు వస్తే భూములు కొనిపించడం.. మధ్య వర్తులుగా కొంత కమిషన్ తీసుకోవడం.. అంతే. ఏదోలా వ్యవసాయంపై తగ్గిన ఆదాయాన్ని భర్తీ చేసుకుంటూ సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు భూముల అమ్మకాలు కొనుగోళ్లు దాదాపుగా పూర్తి అయినందున ఫ్లాట్లు, ఇళ్లు అమ్మకాలపై వీరు ఆధారపడ్డారు.

ఇంతవరకూ బాగానే ఉంది గత ఎన్నికల్లో వీరంతా చందాలు పోగేసుకుని మరీ వైసిపి అభ్యర్ధులను గెలిపించుకున్నారు. కమ్మ వాళ్ల రాజ్యం అంతరించిందని సంబరాలు చేసుకున్నారు. కట్ చేస్తే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు వారికి తెలిసి వచ్చింది. 15 వేల కుటుంబాలకు చెందిన దాదాపు 60 నుంచి 70 వేల మందికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. దాదాపు 12 నుంచి 14 వేల ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చింది రెడ్డి కులస్తులే. ఇటు భూమీ పోయింది..అటు రియల్ ఎస్టేట్ వ్యాపారమూ పోయింది.. కమ్మ రాజ్యం అంతరించిందని, రెడ్డి రాజ్యం వచ్చిందని సంతోషించే లోపే వారి ఆనందం కూడా ఆవిరైంది. రెడ్డి రాజ్యాన్ని విమర్శిస్తే కమ్మోళ్ల దృష్టిలో చులకన అవుతామని, విమర్శించకపోతే జీవనోపాధి పోతోందని రెడ్లు అంతర్గతంగా కుమిలిపోతున్నారు.