రోజాకు అమరావతి ఉద్యమ సెగ.. నీరుకొండలో కాన్వాయ్ ను అడ్డుకున్న రైతులు

వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాకు అమరావతి ఉద్యమ సెగ తలిగింది. ఇవాళ నీరుకొండలోని ఎస్.ఎర్.ఎం యూనివర్శిటీలో నిర్వహించిన ఓ సదస్సుకు రోజా హాజరయ్యారు. రోజా యునివర్సిటీకి వచ్చిన విషయం తెలుసుకున్న స్ధానిక రైతులు అక్కడికి చేరుకున్నారు. వర్సిటీ క్యాంపస్ నుంచి బయటికి వస్తున్న రోజా కాన్వాయ్ కు అడ్డు తగిలారు. టీడీపీ మహిళా నాయకురాలు దివ్యవాణితో కలిసి అక్కడికి చేరుకున్న రైతులు అమరావతికి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. రోజా కారు దిగకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపు ఉద్రిక్తత అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని రోజాను అక్కడి నుంచి పంపించారు. గతంలో మంగళగిరి వద్ద జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన రైతులు.. అటుగా వెళుతున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడికి పాల్పడ్డారు.

ఏపీలో మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమరావతిలోనే రాజదానిని ఉంచాలని డిమాండ్ చేస్తూ 29 గ్రామాల రైతులు ఉద్యమం చేపట్టారు. ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీల నేతలు వారికి సంఘీభావం ప్రకటించారు. వైసీపీకి చెందిన నరసరావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు మందడంలో రైతుల దీక్షా శిబిరానికి వచ్చి వారి సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళతానని హామీ కూడా ఇచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని రైతులకు మద్దతుగా సీఎం జగన్ వద్దకు కొందరు రైతులను తీసుకెళ్లి వారి వాదన వినిపించార. అయితే వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై గుర్రుగా ఉన్న రైతులు సచివాలయానికి వెళ్లే దారితో సీఎం జగన్ తో పాటు మంత్రుల కాన్వాయ్ ను అడుకునే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.