60 వ రోజుకు చేరిన రాజధాని ఆందోళన.. రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన!

రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్ తో రైతులు చేయి, చేయి కలిపి తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. అమరావతి రాజధాని తరలింపు నిర్ణయాన్ని నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు ఇవాళ్టికి అరవైయవ రోజుకు చేరాయి. రోజుకో రూపంలో రైతులు, మహిళలు, రైతు కూలీలు తమ నిరసనను తెలుపుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తుళ్లూరు, మందడంలో మహాధర్నాలో కొనసాగించారు. రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు, జై అమరావతి నినాదంతో రాజధాని ప్రాంతం మారుమోగింది. మందడం, తుళ్లూరులో మహిళలు పన్నెండు గంటల నిరాహార దీక్ష చేశారు. మందడంలో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాజధాని అమరావతికి మద్దతు తెలపాలంటూ అసెంబ్లీ సచివాలయం ఉద్యోగులు పోలీసులకు గులాబీలు పంచారు. రాయగుడిలో ముస్లిం మహిళలు స్థానిక దర్గాల్లో పొంగళ్లు పెట్టి అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ప్రార్థనలు చేశారు. అమరావతి కోసం ఎన్ని రోజులైనా పోరాడతామని పునరుద్ఘాటించారు. తమను రెచ్చగొట్టాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం కూడా తమ బతుకులతో ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

అమరావతితోనే మా భవిత అంటూ తుళ్లూరు మహిళలు శుక్రవారం మానవహారంగా ఏర్పడి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. గ్రామం నడిబొడ్డున ఉన్న ఎర్రమాసు వారి చెరువు చుట్టూ మహిళలు మానవహారంగా ఏర్పడి జై అమరావతి నినాదాలు చేశారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఏడు వందల మీటర్ల దూరం ఉన్న చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ మీద చేయి చేయి కలిపి ఆకుపచ్చ రంగు బెలూన్ లు పట్టుకుని అమరావతికి జై అంటూ నినదించారు. పుల్వామా ఘటనలో అమరులైన జవాన్ లకు మందడం మహిళలు, రైతులు ఘన నివాళి అర్పించారు. వారి త్యాగాలను మననం చేసుకుంటూ మౌన ప్రదర్శనగా గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వారు చూపిన తెగువను ఆదర్శంగా తీసుకొని అమరావతి ఉద్యమం కొనసాగిస్తామని మహిళలు ప్రతినబూనారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఎర్రబాలెం, వెలగపూడి, రాయిపూడి, తుళ్లూరు, అనంతవరం గ్రామాల్లో పర్యటించనున్నారు.