వుమెన్స్ డే సాక్షిగా మహిళా రైతులపై దాష్టికం! 

ఆంధ్రప్రదేశ్ లో మరో అరాచకం జరిగింది. మహిళా దినోత్సవం రోజునే మహిళలకు ఘోర అవమానం జరిగింది.  కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించునేందుకు వెళుతున్నఅమరావతి మహిళా రైతుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర మహిళా రైతులను అడ్డుకున్న పోలీసులు.. వారికి బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా కొందరు పోలీసులు.. మహిళల పట్ల దురుసుగా వ్యవహరించారు. మహిళలను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. కొందరినైతై మంగళగిరి పీఎస్‌లో మూడు గంటలు ఉంచి తర్వాత వెంకటపాలెంవద్ద వదిలిపెట్టారు.

సుమారు వంద మంది పోలీసులు తమపై దారుణంగా వ్యవహరించారని మహిళా రైతులు వాపోయారు. మేమేం పాపం చేశాం.. మమ్మల్ని ఎందుకిలా చేస్తున్నారు.. మహిళలను కింద పడేసి పోలీసులు తొక్కుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. శాంతియుతంగా పాదయాత్ర ద్వారా అమ్మవారిని దర్శించుకునేందుకు వెళుతుంటే పోలీసులు తమపై దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన పొట్టపై పొడిచారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంత దారుణం ఏ ప్రభుత్వంలో చూడలేదన్నారు. మహిళా దినోత్సవం రోజున మహిళలకు అవమానం జరిగిందన్నారు.

ప్రభుత్వం ఎన్న నిర్బంధాలు విధించినా తమ ఉద్యమం అపేదిలేదని, ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని ప్రభుత్వం ప్రకటించే వరకు ఆందోళన చేస్తామని మహిళలు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకురాలు ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చి మహిళలకు మద్దతు తెలిపారు. జగన్‌కు పరిపాలన చేయడం చేతకావడంలేదని, ఇంత వరకు రాజధాని నిర్మాణం చేయలేదని మహిళలు విమర్శించారు. మహిళలను హింసపెడుతున్న దిక్కుమాలిన ప్రభుత్వమని దుయ్యబట్టారు. పోలీసులు, ఉద్యోగులను అడ్డంపెట్టుకుని డబ్బులు కుమ్మరించి అధికారంలోకి రావడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేసిన తప్పేంటని ప్రశ్నించారు. రాజధాని కోసం తమ భూములను ఇవ్వడం తప్పా అని మహిళలు నిలదీశారు.

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మహిళలకు లేదా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఇదేనా మహిళా దినోత్సవం రోజు మహిళలకు జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ‘‘మీ పత్రికా ప్రకటనలో మహిళలకు ఉన్న స్వేచ్ఛ రాష్ట్రంలో కనపడటం లేదు. జగన్ రెడ్డి గారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మహిళలకు లేదా? కనీసం గుడికి వెళ్లే హక్కు కూడా లేదా? అమరావతిలో మహిళల్ని అడ్డుకొని పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని, రైతుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇదేనా మహిళా దినోత్సవం రోజు మహిళలకు జగన్ రెడ్డి ఇచ్చే గౌరవం’’ అని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.