ఇక ఏడవండి!

 

 

 

ఓ తెలుగోళ్ళారా.. ఇక ఏడవండి! ఏడవమంటే అలా చూస్తారేంటి? బాగా ఏడవండి! ఇంతకీ నేనెవరనుకుంటున్నారా? నేను.. మీ కృష్ణవేణిని.. అర్థం కాలేదా? కృష్ణానదిని! ఎక్కడో పుట్టి.. ఎక్కడెక్కడో ప్రవహించి, తెలుగింటికి చేరే జీవనదిని! నాలో వున్న నీటిని వాడుకునే విషయంలో జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు ఇచ్చిందిగా... నాలో వున్న మిగులు జలాల వాడకం విషయంలో మీకు అంత సీన్ లేదని డిసైడ్ చేసిందిగా! కర్నాటక, మహారాష్ట్రలు ఎక్కువ నీటిని వినియోగించుకునే విధంగా తీర్పు ఇచ్చేసిందిగా! ఇప్పుడు మీకు ఏడుపొస్తోంది కదూ.. ఏడవండి! మీ తెలుగోళ్ళు ఏడవటం మినహా ఏం చేయగలరు?

 

మీరు ఎప్పుడు చూసినా విడిపోదామా, కలిసుందామా, హైదరాబాద్ ఎవరిది, భద్రాచలం ఎవరిదని పోట్లాడుకుంటారే తప్ప.. మీరు పోట్లాడుకోవడం వల్ల ఎంత నష్టపోతారన్నది ఏనాడైనా ఆలోచించారా? ఇప్పుడు చూడండి ఏమైందో! అల్మట్టి డ్యామ్ ఎత్తు పెరిగిపోతుంది. మీ స్టేట్లోకి వచ్చే నా నీరు తగ్గిపోతుంది. మీలోమీరు కొట్టుకుంటూ సరైన వాదనలు వినిపించకపోవడం వల్ల కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళది పైచేయి అయింది. ఇప్పుడీ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు ఓకే చేసిందంటే 2050 వరకు మీ ఏరియా ఎడారే! బిరబిరా కృష్ణమ్మ తరలిపోతుంటేను బంగారు పంటలే పండుతాయి అని తెలుగుతల్లి పాటని పాడటం కాదు.. కృష్ణవేణి.. తెలుగింటి విరిబోణి.. కృష్ణవేణి.. మా ఇంటి అలివేణీ అని సినిమా పాటలు పాడుకోవడం కాదు..  నా నుంచి మీకు న్యాయంగా రావాల్సిన నీళ్ళ వాటాని పొందడానికి మీరు ఏం కృషి చేశారని ప్రశ్నిస్తున్నా! మీలో మీరు పోట్లాడుకుంటూ వుండటం వల్ల అందరికీ మీరు చులకనైపోయారు. 42 మంది ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్‌గా వున్నప్పుడే మీ మాట పట్టించుకునేవాడు ఎవడూ లేకుండా పోయాడే!




రేపు రాష్ట్రం రెండు ముక్కలైతే మీ మొహాలు చూసేవాడెవడైనా వుంటాడా? బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పువల్ల ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర రెండూ ఎండుతాయ్. ఖర్మకాలి రాష్ట్రం విడిపోతే నీళ్ళకోసం తెలుగోళ్ళే తన్నుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మిగతా విషయాల్లో ఎలాగైనా తన్నుకుని చావండిగానీ, నా నీళ్ళ విషయంలో మాత్రం కాస్త కలసికట్టుగా వుండి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. ఇప్పటికైనా నా మాట వింటే బాగుపడతారు. లేకపోతే మీ ఖర్మ!



ఇట్లు..
-
మీ కృష్ణానది