పేరుకే కలెక్టర్.. పని చేస్తుంది వైసీపీ ప్రభుత్వానికి.. ప్రజలకు కాదు

 

పని తక్కువ ఉన్నా పనితనం ఎక్కువగా కనిపించేలా  సొంత పబ్లిసిటీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు ఇద్దరు కలెక్టర్లు. మరో ఇద్దరు అయితే అధికార పార్టీ అధికార ప్రతినిధిని మించిపోయేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తమను కలవాలంటే వైసీపీ నేతల అనుమతి తీసుకోవాలని.. వారు ఫోన్ చేసి చెబితేనే అపాయింట్ మెంట్ ఇస్తామనే విధంగా రూల్స్ పాటిస్తున్నారు. వీరి తీరుతో అధికార పార్టీ నేతలు జిల్లా స్థాయి అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పుడు రాయలసీమలో ఎక్కడ చూసినా వీరి గురించే చర్చలు సాగుతున్నాయి.

సీమకు చెందిన ఓ అధికారి ప్రజలకు చిక్కడు దొరకడు. మీరు కలవాలని.. మాట్లాడాలని.. ఆశపడితే సోషల్ మీడియాలో దర్శనమిస్తారు. మీకు బైక్ రైడింగ్ ఆసక్తి ఉంటే ఆయనతో పాటు లాంగ్ డ్రైవ్ కు కూడా వెళ్లవచ్చు. అలా ఆయనతో లాంగ్ డ్రైవ్ కి వెళ్లాలంటే  సోషల్ మీడియాలో ఆయన గారిని విపరీతంగా పొగడాలి. సీఎంకు, అధికార పార్టీ సోషల్ మీడియాకు చేరేలా ఆయనను ప్రమోట్ చేయాలి. ఈ షరతులకు మీరు సై అంటే ఆయన సై సై అంటారు. ఆయన ఆఫీసులో.. ప్రజల మధ్య కంటే.. రైడింగ్, టూర్లు, స్పెషల్ ఫ్రెండ్లీ పార్టీల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. వీటిలో పాల్గొనే వారికి కలెక్టర్ హోదాలో సకల ఏర్పాట్లు రాచ మర్యాదలు చేయిస్తుంటారు. ఓ వైపు ఇలా జరుగుతున్నప్పుడే ఆయన అపర ప్రజాబంధు ప్రజల కలెక్టర్ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంటారు. దీనికోసం కలెక్టరేట్లో ఇద్దరు నిపుణులు పనిచేస్తున్నారు. కలెక్టర్ టూర్లో ఉన్నప్పుడు ఆయన లేని లోటు కనిపించకుండా ఉండటానికి ఈ ప్రత్యేకమైన ప్రమోషన్. ఇక జిల్లాలో పరిపాలన భారమంతా జూనియర్ల పైనే ఉంటుంది. కేవలం బలహీన వర్గాల కోసమే గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని అంటారు కానీ ఆయన మాత్రం అక్కడికి రారు.  ప్రభుత్వానికి అత్యంత కీలకమైన జిల్లాలో నమ్మకస్తులు.. నిజాయితీపరుడని పేరున్న వ్యక్తిగా భావించి కలెక్టర్ గా నియమిస్తే ఆయన ప్రజాపాలన మరచి రాజకీయ సేవల్లో తరించిపోతున్నారు. పాలనా వ్యవహారాలు పక్కన పెట్టి సచివాలయం మొదలు ఆయా శాఖల్లో ఎవరు ఏ పోస్టులో ఉండాలో ఎవరిని ఎక్కడ నియమించాలో ప్రభుత్వ పెద్దలకే దిశా నిర్దేశం చేస్తుంటారు.

జిల్లా స్థాయిలో వైసీపీ నేతలు ,ఏ పని చేయాలి ఏ విషయంలో తలదూర్చిలో కూడా పై నుంచి చెప్పిస్తుంటారని చెబుతున్నారు. ఇటీవల ఓ ప్రాజెక్టు గురించి మాట్లాడేందుకు ఓ పెద్దమనిషి కలెక్టర్ అపాయింట్ మెంట్ కోరారు. ఓ వైసీపీ నేత పేరు చెప్పి ఆయనతో ఫోన్ చేయించుకొని రావాలని చెప్పి ఆ ఫోన్ వచ్చాకే అపాయింట్ మెంట్ ఇచ్చారట ఈ కలెక్టరు గారు. పేదలకు ఇళ్లు ఇచ్చే విషయంలో లబ్ధిదారుల ఎంపిక జాబితా పై నియోజకవర్గం వారిగా ఎమ్మెల్యేల ఆమోదం తీసుకోవాలని.. వారి అనుమతి లేకుండా ఒక్క పేరును కూడా లిస్ట్ లో చేర్చవద్దంటూ హుకుం జారీ చేయటం అధికారుల్లో విస్మయానికి గురిచేస్తుంది.నోరు తెరిస్తే అధికారులను పచ్చి బూతులు తిట్టడం ఆయన శైలిగా చూపుతున్నారు. ఇటీవల ఓ వైసీపీ నేతపై సైతం ఇదే భాష ప్రయోగించడంతో రచ్చ జరిగిందని నేతలు పేర్కొంటున్నారు.