మహాకూటమికి మద్దతుగా మరో పార్టీ

 

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించడమే ధ్యేయంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐతో ఏర్పాటైన మహాకూటమిలో తాజాగా మరో పార్టీ చేరింది.కూటమికి నిస్సంకోచంగా తమ మద్దతు ఇస్తున్నట్టు ఆల్‌ ఇండియా ముస్లిం నేషనల్‌ లీగ్‌ పార్టీ ప్రకటించింది. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య అంతర్గత ఒప్పందం ఉందని ముస్లి నేషనల్‌ లీగ్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ ఘని ఆరోపించారు. గాంధీ భవన్‌లో ఆర్‌సీ కుంతియాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని.. ఇచ్చిన హామీలకు తగిన నిధులు కేటాయించలేదని విమర్శించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ విషయంలో కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. అందుకే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వకూడదని తమ పార్టీ నిర్ణయించుకుందన్నారు. టీఆర్ఎస్ అన్ని అంశాల్లో భాజపాకు మద్దతిస్తోందని, అందుకే తాము కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన మహాకూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.