నిర్మల్ పోలీస్ స్టేషన్ కు అక్బరుద్దీన్, 144 సెక్షన్..?

 

కొద్దిరోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో జరిగిన ఒక భారిబహిరంగసభలో హిందూ దేవతలను కించపరుస్తూ, ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగం చేసిన యంఐ.యం. పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసికి వ్యతిరేఖంగా సర్వత్ర నిరసనలు వెల్లువెత్తడంతో, ఇటువంటి విషయాలలో మొట్ట మొదట స్పందిచాల్సిన ముఖ్యమంత్రి తాపీగా, మొక్కుబడిగా స్పందిస్తూ ‘చట్టం తన పని తానూ చేసుకుపోతుందని’ ఓమాట చెప్పి బాద్యతను పోలీసుల మీదకి నెట్టేశారు. అప్పుడు పోలీసులు, అతనిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

 

రాష్ట్రంలోనే కాకుండా దేశంలో పలుచోట్ల కూడా అతనిపై పోలీసు కేసులు నమోదు చేయబడ్డాయి. అయితే, అక్బరుద్దీన్ తన సభలోప్రజలపై విషం చిమ్మిన తరువాత, మరి ముందే ఈ సమస్యని ఊహించినందువల్లనో మరి వేరే ఇతర కారణాలతోనో వెంటనే లండన్ వెళ్ళిపోయాడు. సమన్లు అందించడానికి వెళ్ళిన పోలీసులకి అవి తీసుకొనే నాదుడు లేకపోవడంతో, ఆ నోటీసులని బంజారాహిల్స్ లో ఉన్న ఆయన ఇంటిగోడకి అంటించి తిరుగుముఖం పట్టాల్సివచ్చింది.

 

అప్పటికీ ఇంకా ఆందోళనలు సాగుతూనే ఉండటంతో, డిజిపి. దినేష్ రెడ్డి మీడియావారితో మాట్లాడుతూ, అక్బరుద్దీన్ స్వయంగా వచ్చి లొంగిపోనట్లయితే, తాము ఇంటర్పోల్ పోలీసుల సహకారం తీసుకునయినా అతనిని దేశానికి రప్పిస్తామని చెప్పడంతో, అక్బర్ నుంచి స్పందన కనిపించింది. తానూ సోమవారం నాడు హైదరాబాదు తిరిగివచ్చి పోలీసుల ముందు లొంగిపోనునట్లు తెలియజేసాడు.

 

ఈ రోజు, అంటే సోమవారం తెల్లవారుజామున అక్బరుదీన్ లండన్ నుండి హైదరాబాదు తిరిగి వచ్చేడు. అతనికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున యం.ఐ.యం. పార్టీ శాసన సభ్యులు, పార్టీ కార్యకర్తలు కూడా శంషాబాద్ విమానాశ్రయానికి తరలి రావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తరువాత పెద్ద ఊరేగింపుగా తన ఇంటికి బయలుదేరిన అక్బరుద్దీన్, మరి కొద్ది సేపటిలో తన పార్టీ శాసన సభ్యులు, కార్యకర్తలను వెంటపెట్టుకొని భారీ ఊరేగింపుతో నిర్మల్ బయలుదేరుతున్నట్లు సమాచారం.

 

అతను నిర్మల్ పోలీసు స్టేషన్లో లొంగిపోయేందుకు కాక, అంతమందిని వెంటేసుకొని దండయాత్రకి బయలుదేరినట్లుగా బయలుదేరడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. వారు సరిపోరనట్లు, స్థానికంగా ఉన్న యంఐ.యం.పార్టీ నేతలు, పార్టీ కార్యకర్తలుకూడా అతనికి తోడవనున్నారు. ఈ పరిస్థితులను ముందే ఊహించిన నిర్మల్ పోలీసులు పట్టణంలో సెక్షన్ 144 క్రింద కర్ఫ్యూ విదించేరు. గానీ, దానిని అపహాస్యం చేయబోతూ అక్బరుద్దీన్ అతని అనుచరులు కూడా భారి ఎత్తున పోలీసు స్టేషన్ జేరుకోబోతున్నట్లు సమాచారం.

 

ఒక బాధ్యాతాయుతమయిన శాసనసభ్యుడిగా అక్బరుద్దీన్ ఇప్పటికికూడా తన మాటలకి పశ్చాతాపం ప్రకటించక, తను చేసిన తప్పుకి సిగ్గుపడకపోగా ఏదో ఘనకార్యం చేసినట్లు ఊరేగింపుగా బయలుదేరడం సిగ్గుచేటు. అంతేగాకుండా, మళ్ళీ నిషేదాజ్ఞాలు ఉల్లగించి మరో తప్పు జేయడానికి ఇప్పుడు సిద్దం అవుతున్నాడు.

 

గత అనేక సం.లలో అతనిపై అనేక కేసులు నమోదు చేయబడినప్పటికీ, స్వేచ్చగా తన విష ప్రచారం కొనసాగిస్తూ, చట్టం తనని ఏమిచేయలేదని పలుమార్లు నిరూపించిన అక్బరుద్దీన్, ఇప్పుడు నమోదు చేయబడిన కేసులనుండి కూడా అంతే తేలికగా తప్పించుకోగలనని నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.

 

ఒక సామాన్యుడిని క్షణాలమీద లాకప్ లో పడేయగల పోలీసులు, ఇటువంటి బడానేతలను మాత్రం ఏమిచేయలేక చేతులు ముడుచుకొని కూర్చవలసి వస్తోందంటే అందుకు మన ఓటు బ్యాంకు రాజకీయాలే కారణం అని చెప్పక తప్పదు. ఇప్పుడు, మతపరమయిన అల్లర్లు చెలరేగుతాయనే భయంతో పోలీసులు అతనిని ఉపేక్షంచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇటువంటి కేసులు చట్టం దృష్టిలో కొందరు ‘అదిక సమానం’ అని నిరూపిస్తుంటాయి.

ఈ కేసులో కొసమెరుపు ఏమిటంటే, అక్బరుద్దీన్ మీద కేసులు నమోదు చేసిన నిర్మల్ పోలీసులవద్ద గానీ, మరే పోలీసు స్టేషన్ వద్ద గానీ, అక్బరుద్దీన్ చేసిన విద్వేష ప్రసంగం యొక్క విడియో సాక్ష్యాలు గానీ, అతని తప్పును నిరూపించే సాక్షులుగానీ లేరు. అందువల్ల, ప్రస్తుతం పోలీసులు వీడియో టేపుల కోసం మీడియా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్లు సమాచారం. అదే పనిలో, ఇంటర్నెట్ లో కూడా యు ట్యూబ్ వంటి వెబ్ సైట్లను కూడా వెతుకుతున్నారని వార్త.