తెలంగాణ కొత్త సీఎస్ గా అజయ్ మిశ్రా?

 

తెలంగాణకు కొత్త ప్రధాన కార్యదర్శి రాబోతున్నారు. ప్రస్తుత సీఎస్ జోషి పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో ఆ స్థానంలో ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సీనియారిటీ ప్రకారం చూస్తే జోషి తర్వాత అజయ్ మిశ్రా ఉన్నారు. 1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన మిశ్రా, 1960 జూలై 16 న జన్మించటంతో ఆయన పదవీ విరమణ 2020 జూలై వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అజయ్ మిశ్రాను సీఎస్ గా నియమిస్తే ఆయన కేవలం 7 నెలలే ఆ పదవిలో కొనసాగే అవకాశముంది.

ఇక తెలంగాణ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారులు కూడా రేసులో ఉన్నారు. ఇందులో వీపీ ఆచార్య టాప్ లో ఉన్నారు. అయితే జోషి కంటే ఆచార్య సీనియర్ అయినప్పటికీ గతంలో అతని పక్కన పెట్టారు కేసీఆర్. జోషిని సీఎస్ గా నియమించారు. దీంతో ఈసారైన ఆచార్యకు అవకాశం కల్పిస్తారా లేక పక్కనపెడతార అన్నది ఆసక్తికరంగా మారింది.

పలువురు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా సీఎస్ రేసులో ఉన్నారు. వినయ్ కుమార్, పుష్పా సుబ్రమణ్యం, హీరాలాల్ పేర్లను కూడా సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త సీఎస్ గా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సీఎస్ గా రాజీవ్ శర్మ నియమితులయ్యారు. ఆయన తర్వాత ప్రదీప్ చంద్ర సీఎస్ గా వచ్చారు. అయితే కేవలం నెల రోజులు మాత్రమే ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.