పామర జనానికి తెలియని నిజాలు

 

కొంచెం కూడా లోకజ్ఞానం లేని అజ్ఞానులయిన భారతీయులు కొందరు దేశాన్నిదారిద్ర్యం పట్టి పీడిస్తోందని అవాకులు చవాకులు వాగుతుంటారు. మీడియా కూడా అటువంటి వారికి వంత పాడుతూ ఎక్కడో మారుమూల గ్రామాలలో ఆకలి చావులు చస్తున్నవారి ఫోటోలు ప్రచురిస్తూ దేశంలో పేదరికం విలయతాండవం చేస్తోందని, సగం మందిపైగా ఒంటిపూట భోజనానికి కూడా నోచుకోవట్లేదని అతిశయోక్తులు ప్రచురిస్తుంది.

 

కానీ, మన అదృష్టం కొద్దీ మహా మేధావులయిన కాంగ్రెస్ నేతలు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులయిన మాంటెక్ ఆహ్లువాలియా వంటి నిపుణులు ఉండబట్టి సరిపోయింది. లేకుంటే ప్రపంచం కూడా ఈ తప్పుడు కధనాలు నమ్మేసి ఉండేది. ఆహ్లూ వాలియా గారు తన ఏసి గదిలో కూర్చోనప్పటికీ ఎంతో చమటోడ్చి అరడజను చాయ్ లు, మరో అరడజను బిస్లిరీ నీళ్ళ బాటల్స్ సేవించి, సుదీర్గ పరిశోధన చేసి మన దేశంలో పేదరిక స్థాయి దాదాపు 22 శాతం తగ్గిపోయిందని కనిపెట్టారు.

 

పామరులయిన ప్రజలకి, వారి పెరిగిన ఆర్ధిక శక్తి గురించి కూడా తెలియజేసి పుణ్యం కట్టుకొన్నారు. ఇప్పుడు చాల మంది భారతీయులలలో సగటున రూ.33కంటే వ్యయం చేయగలిగే స్థితికి చేరుకొన్నారని, అంటే ఇక వారందరూ దారిద్యరేఖపై నుండి హై-జంప్ చేసి మద్యతరగతిలోకి వచ్చిపడ్డారని శలవిచ్చారు.

 

కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ ముంబాయిలో తన ఆఫీసుకి తన ఇంపోర్టెడ్ కారులో వెళుతూ పేపర్లో ఆ వార్త చదివి చాలా ఆనందపడిపోయారు. కానీ, ఇంత గొప్ప సంగతి తనకంటే తెలిసింది. కానీ, పాపం! రోడ్డు పక్కన ఫుట్ పాత్ ల మీద తిండి లేక ఈసురో...మని మొహాలు వ్రేలాడేసుకొని కూర్చోన్నవారికి ఎలా తెలుస్తుంది? అని ఆలోచించి, ఆఫీసుకి చేరుకోగానే ఒక స్థానిక పత్రికకి ఫోన్ చేసి ఈ విషయమంతా చెప్పి, ముంబైలో కేవలం రూ.12 పెడితే కడుపు నిండా భోజనం దొరుకుతుందని, అందువల్ల మిగిలిన రూ.21లతో అందరూ పండుగ చేసుకోవచ్చునని తన మాటగా ఆ ఫుట్ పాత్ జనాలకి తెలియజేయమని ఆయన ఆదేశించారు.

 

అయితే, ఆసంగతి అ ఫుట్ పాత్ జనాలకి తెలియలేదు, కానీ అంతకంటే ముందుగా డిల్లీలో తన ఫాం హౌస్ లో ఫ్రూట్ జ్యూస్ త్రాగుతూ సేద తీరుతున్నరషీద్ మసూద్ అనే కాంగ్రెస్ పెద్దాయనకి తెలిసిపోయింది. ఆయన వెంటనే మీడియా వాళ్ళని పిలిపించుకొని “మీరు ఆ రాజ్ బబ్బర్ మాటలు పట్టించుకోవద్దు. ఇక్కడ డిల్లీలో అయితే రూ.5పడేస్తే సుష్టుగా పొట్ట పగిలేలా తినొచ్చును. ఆ లెక్కన మనిషికి మొత్తం రూ.28 చొప్పున మిగిలిపోతుంటుంది. ఇక అదంతా ఎలా ఖర్చు చేయాలి? ఎప్పుడు ఖర్చు చేయాలి? డబ్బు ఖర్చు చేయలేని స్థితిలో ప్రజలుంటే ఇక దేశంలో పేదరికం ఎక్కడ మిగులుతుంది?” అని సూటిగా మీడియా వాళ్ళను ప్రశించారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వాళ్ళు బయటకొస్తుంటే, ఫారూక్ అబ్దుల్లా అనే మంత్రిగారు తన ఏసి కారులోంచి దిగి “ఏంటి సంగతీ?” అని అడిగారు. మీడియా అంతా పూసగుచ్చింది.

 

“అసలు ఒక్క రూపాయికి కావలసినంత తిండి దొరుకుతుంటే, వీళ్ళేమిటి 5, 12 అని తప్పుడు లెక్కలు చెపుతున్నారు?” అంటూ తెగ చిరాకుపడిపోయారు. “మనం ఏమి, ఎంత, ఏ రకం ఫుడ్డు తినాలనుకొంటున్నామనే దాని బట్టే ఖర్చుఉంటుంది తప్ప, ఒక సింపిల్ భోజనం కావాలంటే ఒక్క రూపాయి చాలదూ? మరటువంటప్పుడు కేవలం మేమే స్విస్ బ్యాంకుల్లో బ్లాక్ మనీ అకౌంట్స్ మెయింటేన్ చేస్తున్నామని ఆ ఆరోపణలేమిటి? ఆ మిగిలిన రూ.32లు ఎక్కడికి పోతున్నాయి? స్విస్ బ్యాంకులోకే కదా? మరి అందరికీ స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఇక దేశంలో పేదరికం ఎక్కడ ఉంది. ఈ సారి ఆ ఆహ్లూవాలియాని కలిసినప్పుడు “ఇండియా మే బీ పూర్, బట్ ఆల్ ఇండియన్స్ ఆర్ రిచ్” అని స్టేట్మెంట్ మార్చమని గట్టిగా చెపుతాను” అని ఆయన మీడియా మీద ఒంటి కాలుపై లేచేసరికి ఇంకెప్పుడు దేశంలో తిండి లేక పేదలు చచ్చిపోతున్నారని వ్రాయమని లెంపలు వేసుకొని బ్రతుకే జీవుడా అంటూ మీడియా వాళ్ళు బయటపడ్డారు.