వైకాపాలోకి అడుసుమిల్లి

 

ఇంత కాలం విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్ కు సన్నిహితుడుగా ఉన్న కాంగ్రెస్ నేత అడుసుమిల్లి జయప్రకాష్, హట్టాతుగా ఆయనకు హస్తం ఇచ్చేసి వైకాపా హస్తం అందుకొన్నారు. ఈ రోజు పార్టీ ఆఫీసులో విజయమ్మ ఆయనకు వైకాపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

ఆయన 1983లో తెలుగు దేశం పార్టీలో చేరి విజయవాడ తూర్పు నియోజక వర్గం నుండి గెలిచారు. ఆయన 1994 నుంచి టిడిపి అర్భన్ అధ్యక్షుడిగా, 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా పనిచేసారు. కానీ, ఆ తరువాత కొన్ని సమస్యల వలన ఆయన చాలారోజుల పాటు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. మళ్ళీ హరికృష్ణ ప్రోద్భలంతో పార్టీలోకి వచ్చినా, ఎన్నికల పొత్తులో భాగంగా బిజెపికి అవకాశం ఇవ్వడంతో పార్టీపై అలిగిన అడుసుమిల్లి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోకి మారి లగడపాటితో ఇంత కాలం సన్నిహితంగా మెలిగారు.

 

ఎన్నికల సమయం దగ్గరపడుతున్నందున వైకాపాకు గెలిచే అవకాశాలున్నట్లు అంచనా వేసుకొన్న ఆయన ఇప్పుడు ఆ పార్టీలో తేలారు. ఆయన రాబోయే ఎన్నికలలో మళ్ళీ విజయవాడ తూర్పు నియోజక వర్గం నుండి పోటీ చేయాలని కోరుకొంటున్నట్లు సమాచారం. కానీ, ఆ స్థానానికి తీవ్ర పోటీ ఉండటంతో మరి ఆయనకీ అవకాశం దక్కుతుందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టం.