చెప్పు పట్టుకొంటున్న సినీ నటి హేమ

 

ఇంతవరకు తెలుగు సినీ పరిశ్రమ నుండి చాలా మంది నటులు రాజకీయాలలోకి ప్రవేశించారు. ఇప్పుడు వారికి మరో నటి హేమ కోడా తోడవనుంది. ఆమె జై సమైక్యాంధ్ర పార్టీ తరపున మండపేట నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేసేందుకు శనివారంనాడు నామినేషన్ వేయబోతున్నారు. ఆ పార్టీ తరపున అమలాపురం నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న హర్ష కుమార్, నిన్న బుదవారం నాడు తన నామినేషన్ వేసేందుకు బయలుదేరినప్పుడు ఆ ఊరేగింపులో హేమ కూడా పాల్గొన్నారు. రేపు ఆమె నామినేషన్ వేసేటప్పుడు ఆయన కూడా రావచ్చును.

 

ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను ఏదో కాలక్షేపం కోసం కాక, నిజంగా ప్రజలకు సేవ చేయాలనే దృడ సంకల్పంతోనే రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నానని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తీరుతో కడుపు మండి, ఆపార్టీని ఓడించాలనే ఉద్దేశ్యంతోనే తాను రాజకీయాలలోకి వచ్చానని అన్నారు.

 

కారణాలు ఏవయినా రాజకీయాలలో ప్రవేశించే సినీ నటులు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు అందరూ చెప్పినట్లుగానే హేమ కూడా చెపుతున్నారు. అయితే ప్రజాసేవ చేసేందుకే రాజకీయాలలోకి వస్తున్నామని చెప్పుకొనే ఇటువంటి వారందరూ, ఈ సందర్భంగా తమ తమ వృత్తి జీవితాలను పూర్తిగా వదిలిపెడతామని మాత్రం ఎన్నడూ హామీ ఇవ్వబోరు. అందువలన సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉండే ఇటువంటి నటీనటులు చేసే ప్రజాసేవ నేతి బీరకాయలో నెయ్యి వంటిదే.