అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ .. జైలుకు తరలింపు

మాజీ మంత్రి అచ్చెన్నాయడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడిందనందున డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ కావడంతో పోలీసులు ఆయనను విజయవాడ జైలుకి తరలించారు. 

ఈఎస్ఐ స్కామ్ లో ఆరోపణలను ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును.. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఇప్పటికే మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అచ్చెన్నాయుడు రిమాండ్ గడువును ఏసీబీ కోర్టు పొడిగించింది. అప్పటి నుంచి కూడా ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే,  ఇప్పుడు ఆసుపత్రి అధికారులు సడెన్‌గా డిశ్చార్జి చేశారు. కరోనా టెస్ట్ చేసి, రిపోర్ట్ వచ్చిన తరువాత మాత్రమే డిశ్చార్జ్ చేయాలని అచ్చెన్నాయుడు కోరినా.. పట్టించుకోకుండా డిశ్చార్జ్ చేసారని తెలుస్తోంది. భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయన్ను జైలుకు తీసుకెళ్లారు.

అచ్చెన్నాయుడుని డిశ్చార్జ్ చేస్తున్నారన్న విషయం తెలిసి.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు టీడీపీ కార్యకర్తలు, నేతలు భారీగా చేరుకున్నారు. టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంగా ఉన్న అచ్చెన్నాయుడుపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు.  

అచ్చెన్నాయుడిని బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రభుత్వ ఒత్తిళ్లతో అచ్చెన్నాయుడిని ఆసుపత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నాను అన్నారు. డిశ్చార్జ్ చేయడంలో కనీస నిబంధనలు పాటించలేదని మండిపడ్డారు. అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అచ్చెన్నాయుడి అరెస్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పులు చేసింది, రెండోసారి సర్జరీ జరిగేందుకు కారణమైంది. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని చంద్రబాబు మండిపడ్డారు.

మరోవైపు, అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్లపై శుక్రవారం ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. శుక్రవారం ఆయనకు ఎక్కడ బెయిల్ వస్తుందోనన్న ఆలోచనతోనే.. ఇప్పుడు ఉన్నట్టుండి డిశ్చార్జ్ చేసి జైలుకి తరలించారని టీడీపీ ఆరోపిస్తోంది. అచ్చెన్నాయుడును ఒకటి,రెండు రోజులయినా జైల్లో ఉంచాలన్నది జగన్ లక్ష్యమని.. అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు మండి పడుతున్నారు.