ఏపీలో టాప్-5 అవినీతి శాఖలపై ఏసీబీ కన్ను.. వరుస సోదాలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి

ఏపీలో లంచాల పేరుతో ప్రజలను దోచుకుతింటున్న ఉద్యోగులు, అధికారులపై ఏసీబీ కొరడా ఝళిపిస్తోంది. అత్యంత అవినీతి శాఖగా పేరున్న రెవెన్యూ డిపార్ట్ మెంట్ పై తొలి పంజా విసిరిన ఏసీబీ అధికారులు తాజాగా నిన్న పురపాలకశాఖ కార్యాలయాల్లోనూ దాడులు చేపట్టారు. శాఖల వారీగా చేస్తున్న ఈ దాడులతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతీ ప్రభుత్వ శాఖలోనూ ఏసీబీ దాడులు తప్పవని అధికారులు తాజా దాడులతో హెచ్చరికలు పంపుతున్నారు.

ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన తర్వాత పలు ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. అయితే అంతకంటే ముందే తన కేబినెట్ లోని మంత్రులు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు సైతం హెచ్చరికలు పంపారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించే సమస్యే లేదని కేబినెట్ సమావేశంలోనే మంత్రులకు స్పష్టం చేసిన సీఎం జగన్ ఇప్పుడు దాన్ని చేతల్లో చూపుతున్నారు. ప్రభుత్వ విభాగాల్లో అవినీతిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవినీతి దర్యాప్తు విభాగాన్నిపటిష్టం చేయాలని భావించిన జగన్ అప్పటికే దాన్ని లీడ్ చేస్తున్న కుమార్ విశ్వజిత్ ను సాగనంపారు. అవినీతిని అరికట్టడంలో తన అంచనాలకు తగినట్లుగా పనిచేయడం లేదని భావించడం వల్లే విశ్వజిత్ ను బదిలీ చేశారు. ఆయన స్ధానంలో తనకు అత్యంత నమ్మకస్తుడైన సీతారామాంజనేయులును తీసుకొచ్చారు. గతంలో పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసి సమర్ధుడిగా పేరు తెచ్చుకున్న సీతారామాంజనేయులు వచ్చీ రాగానే పని ప్రారంభించేశారు.

రవాణాశాఖ కమిషనర్ నుంచి ఏసీబీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీతారామాంజనేయులు కీలకమైన రెవెన్యూ, మున్సిపల్ శాఖలపై దృష్టిసారించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాల్సిన అధికారులు అవినీతిలో మునిగి తేలడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని భావించిన ఆయన... వచ్చీ రాగానే రంగంలోకి దిగారు. అక్రమార్కులపై చర్యల విషయంలో సీఎం జగన్ కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో విమర్శలకు వెరవకుండా గతేడాది 21న రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, తహసీల్డార్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ  సోదాలు చేపట్టింది. సిఫార్సులను సైతం లెక్కచేయకుండా అవినీతిపరుల జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి చేరవేసింది. ఆ తర్వాత మరో కీలక విభాగమైన పురపాలకశాఖపై ఏసీబీ దృష్టిసారించింది. 

మంగళవారం రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్ కార్యాలయాల్లోని టౌన్ ప్లానింగ్ విభాగాలపై ఏసీబీ మెరుపు దాడులకు దిగింది. ఇందులో భారీ ఎత్తున ఆధారాలను సైతం సేకరించేంది. లెక్కతేలని నగదుతో పాటు డాక్యుమెంట్లను జప్తు చేసింది. 13 జిల్లాల్లో 14 టీమ్ లుగా విడిపోయి 100 మందికి పైగా అధికారులు చేపట్టిన సోదాల్లో పలుచోట్ల చాలా మంది ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా టౌన్ ప్లానింగ్ విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. లంచాలకు కక్కుర్తి పడి సిటిజన్ ఛార్జర్ అమలు చేయకపోవడం, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోకపోవడం, తనిఖీలు నిర్వహించకపోవడం, బీపీఎస్ దరఖాస్తులను పెండింగ్ లో ఉంచుకోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించి కేసులు నమోదు చేశారు. త్వరలో మిగిలిన విభాగాల్లోనూ సోదాలు నిర్వహించేందుకు ఏసీబీ పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది.