అబద్ధాలకు తెరతీసిన "వేర్పాటు''!

- డా.ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

 ABK Prasad separate telangan issue, ABK Prasad Kcr, separate telangan issue Kcr, ABK Prasad telangana, kcr ABK Prasad

 

 

అబద్దాల నోటికి అరవీసెడు సున్నం కొట్టినా చాలదట! ఊదర ద్వారా ఏ ఉద్యమాలూ నిలవవు; ఊదర వల్ల ఉద్యమాలకు అస్తిత్వం రాదు. ప్రజలకు, దేశానికి, రాష్ట్రాలకు 'అసిత్వం' అనేది సామాజిక, ఆర్థికరంగాలలో పాలనావ్యవస్థలు ప్రజానుకూలమైన, ప్రణాళికాబద్ధమైన, ద్వంద్వప్రమాణాలకు తావులేని పథకాలను ఆచరణలో జయప్రదంగా అమలు జరిపినప్పుడు మాత్రమే స్థిరపడుతుంది. ఆ ప్రగతి ప్రజాతంత్ర విప్లవం ద్వారా మాత్రమే ప్రజాబాహుళ్యం అనుభవంలోకి వస్తుంది. ప్రజలకు సామాజిక, ఆర్థికస్థిరత్వం అప్పుడు మాత్రమే సాధ్యం. అలాంటి స్థిరత్వం ద్వారానే జాతికీ, దేశానికీ, రాష్ట్రాలకూ ఆత్మగౌరవం సిద్ధిస్తుందిగాని పదవీ ప్రయోజనాల కోసం రాజకీయ నిరుద్యోగులు ప్రారంభించే ఊదర ఉద్యమాల వల్ల ఎంతమాత్రం సంప్రాప్తించదు! పరిణామాలకు చెప్పే వక్రభాష్యాలవల్ల, ఆడే అబద్దాలవల్లా ప్రాంతాలకు స్థిరత్వంగానీ, ప్రజలకు ఆత్మగౌరవంగానీ సమకూడదు. ఈ సూత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోని మోతుబరులకూ, చీలికవాదం చాటున, సమైక్యతా వాదం చాటునా దాచుకుంటున్న స్వార్థపరులందరికీ సమంగానే వర్తిస్తుంది.



ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవాలంటే, అటూ యిటూ కూడా కృత్రిమంగా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ పేరుకు మాత్రమే 'మేథావులు'గా చెలామణి కాజూస్తున్న కొందరు కుహనా విద్యాధికులూ పలుకుతున్న అబద్ధాలు! ఈ మోతుబరులు, ఈ విద్యాధికులలో హెచ్సుమంది అటుయిటూ కూడా ప్రాంతాలలోనూ తరతమ భేదాలతో, ఆంధ్రప్రదేశ్ (విశాలాంధ్ర) రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎదిగివచ్చిన నయా (నియోరిచ్) సంపన్న వర్గాలేనని మరచిపోరాదు. వీరిలో ఒక ప్రాంతంలోని మోతుబరులకు దేశానికి స్వాతంత్ర్యం రాక ముందునుంచీ ప్రెసిడెన్సీలో భాగంగా తెలుగుసీమలోని ఒక ప్రాంతం ఉన్నప్పుడే కొంత ఆర్థికస్తోమత సమకూడి ఉంది. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగువారు వేరై ఆంధ్రప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఈ సంపన్నవర్గం మరింత బలపడుతూ వచ్చింది. ప్రారిశ్రామికంగానూ, వ్యవసాయకంగానూ. కాని ఈ మోతుబరుల 'బలాన్ని' చూపి ఆంధ్రప్రాంతంలోని నూటికి తొంభైమంది ప్రజాబాహుళ్యం స్థితిగతులన్నీ మెరుగైపోయినట్టు భావించరాదు; జల సమస్యలు ముగింపునకు వచ్చినట్టూ భావించరాదు.

 


అలాగే బ్రిటిష్ వలసపాలకుల అండతో హైదరాబాద్ కేంద్రంగా నిజామాంధ్రలోని తెలుగుప్రజలపైన దారుణమైన నిరంకుశ పాలనను సాగిస్తూ తెలుగుప్రజల్ని తెలుగు పాఠశాలలు పెట్టుకోనివ్వకుండా ఉర్దూను మాత్రమే పాలనా భాషగానూ రుద్ది, స్వభాషా సంస్కృతులకు దూరంచేసి, దొరల, జాగిర్దార్ల, దేశ్ ముఖ్ ల దౌర్జన్యాలను అనుమతించడం ద్వారా నిజాంసర్కార్లు [ఒక్క కుతుబ్ షాహీ మినహా] ప్రజల్ని వెట్టిచాకిరీకి తాకట్టుగా మార్చాయి! ఆ పరిస్థితుల్లో అక్కడ నిజాంకు తాబ్ దార్లుగా మారిన ఏ కొలదిమంది దొరలూ, జాగిర్దార్లూ మాత్రమే సంపన్నులుగా చెలామణీ అయ్యారు. కాని, మెజారిటీ తెలంగాణా తెలుగుప్రజలను నిజాముతోపాటు తెలుగుదొరలూ, తెలుగు జాగిర్దార్లూ, తెలుగు పటేల్, పత్వారీలూ దారుణ దోపిడీ ద్వారా పీల్చుకుతిని పిప్పిచేసి 'నీ బాన్చని దొరా, నీ కాల్మొక్తా' అన్న బానిసవ్యవస్థకు బందీలు చేసి వదిలారు. ఒక్క తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం [ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సాహస నాయకత్వంలో] మాత్రమే ఏకభాషా సంస్కృతులు ఆధారంగా ఉభయ ప్రాంతాలలోని తెలుగువారినందరినీ ఏకోన్ముఖం చేసి విశాలాంధ్ర ఏర్పాటుకు భౌతిక, మానసిక పునాదుల్ని పటిష్టం చేసింది. అయితే అంతకుముందు ఆంధ్రరాష్ట్రావతరణ తర్వాత ''నియోరిచ్'' కోస్తాంధ్రలో ఎలా తలెత్తిందో, ఇటు విశాలాంధ్ర అవతరణ తర్వాత మన తెలంగాణా ప్రాంతంనుంచి కూడా "నయాసంపన్నవర్గం'' తలెత్తింది. అంతకుముందెన్నడూ లేని స్థాయిలో విశాలాంధ్ర ఏర్పడిన తరువాత కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి విద్యా, వ్యాపారరంగాల నుంచి ఎలా గణనీయమైన సంఖ్యలో "విదేశీ భారతీయులు''గా (ఎన్.ఐ.ఆర్.లు) ఎదుగుతూ వచ్చారా, అలాగే మన తెలంగాణానుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాతనే ఎన్.ఐ.ఆర్.ల సంఖ్యా నానాటికీ పెరుగుతూ వచ్చింది. ఈ పరిణామం ప్రధానంగా పరాయిపాలన నుంచి విడివడి, ఉభయప్రాంతాలలోని తెలుగువారంతా 'విశాలాంధ్ర' (ఆంధ్రప్రదేశ్)గా ఏర్పడిన తరువాతనే జరిగిందని మరచిపోరాదు!


 

అయితే అటూ, యిటూ కూడా సామాన్య ప్రజాబాహుళ్యానికి సమష్టిగా దక్కవలసిన రాష్ట్ర సహజవనరులు అందుబాటులోకి వచ్చాయని కలలో కూడా భావించకూడదు! ఈ సహజవనరులపై పెత్తనం కోసం ఉభయప్రాంతాలలోని మోతుబరుల మధ్య పెరుగుతూ వచ్చిన స్ఫర్ధలే, ప్రజాబాహుళ్య ప్రయోజనాలతో సంబంధంలేని వ్యర్థ ఉద్యమాల రూపంలో దఫదఫాలుగా తలెత్తుతూ రాష్ట్ర ప్రజల మూల్గులను పీల్చి వేస్తున్నాయి, ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ సమయంలో వామపక్షాలు సహితం ప్రజలకు నాయకత్వం వహించి వాస్తవాలను బోధించి సమీకరించడంలో విఫలమవడం ప్రజలపాలిట 'శాపం'గా మారి, మోతుబరులకు, వారి పాలకశక్తులకూ పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ అండదండలు అందించినట్టయింది! ఇందుకు ప్రధాన కారణం - విభేదించే విధానాలు చెప్పుకోదగినవి లేకపోయినా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలుబాటలలో యింకా ప్రయానిస్తూండటమే! ప్రజల్ని సరైన పంథాలో చైతన్యవంతుల్ని చేయడంలో తరచుగా విఫలమావుతూండటంవల్లనే ప్రజాతంత్ర ఐక్యసంఘటిన నిర్మాణంలో కూడా క్రియాశీల పాత్ర వహించలేకపోతున్నారు; ఐక్యప్రజాతంత్ర ఉద్యమాలు నిర్మించుకోడానికి ముందు ఉభయకమ్యూనిస్టు పార్టీలు [సి.పి.ఐ.-సి.పి.ఎం.] ఏకమై తిరిగి ఒక పార్టీగా అవతరించడం అవశ్యం జరగాల్సినపని. తెలంగాణా ఏర్పాటువాదం తలెత్తడానికి, ఎలాంటి శాస్త్రీయలక్ష్య నిర్వచనా లేకుండా కొందరు రాజకీయ నిరుద్యోగులు తలపెట్టిన ఉద్యమానికి కమ్యూనిస్టుపార్టీల ఉదాసీనత, నిర్వ్యాపార స్థితియే కారణం. అందువల్లనే రకరకాల అబద్ధాలకు వేర్పాటు ఉద్యమకారులు గజ్జెకడుతున్నారు; ఉభయప్రాంతాలలోని స్వార్థపర సంపన్నులూ, రాజకీయ నిరుద్యోగులూ భిన్నకోణాల నుంచి తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికైనా సిద్ధమేగాని పరాయి పాలకులనుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్న 'విభజించి-పాలించే' సూత్రాన్ని వదులుకోడానికి మాత్రం వదులుకోడానికి సిద్ధంకావటంలేదు!



 

కనుకనే అనేక అబద్ధాలను ప్రచారంలో పెట్టడానికి వీరిలో కొందరు వెరవడం లేదు. ఉదాహరణకు తెలంగాణాలో ఒక మోతుబరి ఇటీవల కాలంలో నెలకొల్పిన ఒక స్థానిక దినపత్రిక - కేంద్రప్రభుత్వం లేదా కాంగ్రెస్ అధిష్ఠానవర్గం రాష్ట్ర విభజన సమస్యపై యింకా ఎలాంటి అవకాశవాద నిర్ణయానికి సిద్ధం కాకపోయినా, "వీర తెలంగాణా'' బదులు వేరు తెలంగాణాను ప్రమోట్ చేయడానికి, రాణి 'విజయాని'కి వచ్చినట్టుగా రంగుపులిమి "జజ్జనకర జనారే - తెలంగాణా ఖరారే'' అంటూ పతాకశీర్షిక పెట్టేసింది. అలా పెట్టడంలో ఉద్దేశ్యం, దాదాపు 800-900 మంది తెలంగాణా ఎస్.సి., ఎస్.టి., బి.సి. తదితర బడుగుబలహీన వర్గాల బిడ్డల్ని తమ రాజకీయ స్వార్థం కోసం బలిపశువుల్ని చేసి ఆత్మహత్యలవైపు పురిగొల్పిన పాపాన్ని మరోరూపంలో కడిగేసుకోడానికి చేస్తున్న తెలంగాణా ప్రయత్నం తప్ప మరొకటి కాదు. తెలంగాణా ''ఖరారే'' అన్నప్పుడు, ప్రత్యేకరాష్ట్రం ఆచరణలో నిర్ణయాత్మకంగా ఖరారైన తరువాత మాత్రమే వాడవలసిన పదం. అంతేగాని, "ఖరారు'' కాకుండానే వాచా 'విజయోత్సవం' జరపడం కనీవినీ ఎరగని పోకడ! కాని పత్రికాధిపతి ఆత్మ‘విశ్వాసం’తో మాత్రమే ‘ఖరార’యిన ‘విజయం’ ఎలాంటిది? అదే స్థాయి పత్రిక మాటల్లో ‘‘హస్తిన (ఢిల్లీ)లో కసరత్‌ ముమ్మరం’’ ఎలా అంటే? కోర్‌ కమిటీ నుంచి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి, అక్కడి నుండి కేంద్రమంత్రివర్గానికి ఆ పిమ్మట రాష్ట్రపతిని నివేదన, ఆదరిమిలా రాష్ట్ర అసెంబ్లీలో ఎలాంటి నిర్ణయం చేయకుండా చర్చకు పరిమితం కావటం, ఆ తరువాత పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం, రాజ్యాంగ సవరణకు మూడింట రెండువంతుల మెజారిటీ అవసరం కాబట్టి, బిల్లు ‘నామ్‌కేవాస్తే’గా రూపొండం.. ఇలా ఎన్నో ‘సంకేతాల’ట! ఇలా ఊహాగానాలనే తెలంగాణా రాష్ట్రం వచ్చేసిందన్న ‘సంకేతాలు’గా మార్చడానికి జరిగిన ప్రయత్నం! ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తెచ్చి, తెలిసో తెలియకో తెలిసినట్టు నటించడం ద్వారా మరో అబద్ధానికి తెర ఎత్తుతోంది ఆ పత్రిక ఎలా?. ''ఆంధ్రప్రదేశ్‌ విభజన అనివార్యం! తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తథ్యం! వరుస పరిణామాలు ఇస్తున్న విసృష్ట సంకేతాలివి!



 

మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడే సమయంలో ముఖ్యమంత్రిగా వుండి, విభజన ఆనుపానులు తెలిసిన నేత దిగ్విజయ్‌సింగ్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమించడం మొదలు... స్వరం మార్చుకున్న కరడుగట్టిన తెలంగాణా వ్యతిరేకులు..!! ఇలా అబద్ధాల బిఠా ఆ పత్రిక వర్ణించింది. అంతగారు, అంతకు ముందు రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా పనిచేసిన గులామ్‌ నబీ అజాద్‌ స్థానంలో దిగ్విజయ్‌సింగ్‌ ‘‘నియామకమే తొలి అడుగ’’ని మహా ‘విశ్వసం’తో రాసేసింది. కాని రాష్ట్ర పర్యాటనలో ఇటు దిగ్విజయ్‌సింగ్‌గాని, అటు అజాద్‌గాని పలు ప్రకనల మధ్యనే విభజన ‘అనుభవాల’గురించి ఏమి చెప్పాలోమాత్రం ఆ పత్రిక వెల్లడిరచకుండా దాచిపెట్టింటి! బిజెపి`ఎన్‌డిఎ పరివార్‌ కేంద్ర ప్రభుత్వం మాధ్యప్రదేశ్‌ను బలవంతంగా విచ్చిన్నం చేసి ఛత్తీస్‌ఖడ్‌ రాష్ట్రాన్ని ఏర్పరచడం వల్ల తామెన్ని కష్టనష్టాలకు గురయ్యామో దిగ్విజయ్‌సింగ్‌ మన రాష్ట్ర పర్యటనలోనే మనకు గుర్తు చేయాల్సివచ్చింది! ‘యథాతథంగా  సమైక్యరాష్ట్రంగానే ఆంధ్రప్రదేశ్‌ను కొనసాగించినా అందుకు రాష్ట్రనాయకులంతా కట్టుబడి ఉండాల్సిందే’’నని కూడా ఆయన హెచ్చరించి పోయాడు! అంతేగాదు ‘‘రాష్ట్ర విభజన అనేది చాలా క్లిష్టమైదీ, బాధాకరమైనదీ, ఆ బాధేమిటో నేను స్వయంగా అనుభవించాను. అందువల్ల రాష్ట్రాన్ని విభజించడం ఆషామాషీ వ్యవహారం కాదు సుమా! మధ్యప్రదేశ్‌ విభజన జరిగినప్పుడు విద్యుత్‌ ప్రాజెక్టులన్నీ ఛత్తీస్‌గఢ్‌లో ఉంటే, వాడకందార్లందరూ మధ్య ప్రదేశ్‌లో ఉండిపోయారు...’’ అన్నారు దిగ్విజయ్‌సింగ్‌!



 

అలాగే అజాద్‌ కూడా లడఖ్‌ విభజన వల్ల మూడు జిల్లాలుగా కాంగ్రెస్‌ అన్ని సీట్లు గెలుస్తుందనుకుని విభజించనా కాంగ్రెస్‌ పూర్తిగా వోడిపోయిందని వాపోయాడు! వేర్పాటు వాదులకు అదీ ‘పరగడపై’పోయింది! ఇక పంజాబ్‌ విభజనవల్ల పంజాబ్‌ హర్యానా ప్రజలు ఇరువర్గాలూ ఘోరమైన ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ప్రసిద్ధ పాత్రికేయుడు కులదీప్‌నయ్యర్‌ మాటనూ ఆ పత్రిక మరిచిపోయి అబద్ధాలు అల్లడం విచారకరం! 'వేర్పాటు’వాదం చేసే రాజకీయ నిరుద్యోగుల్లో ఒకరు ఇప్పటిదాకా కేంద్రం ప్రకటన ఎందుకు రాలేదన్న పశ్నకు సమాధానంగా ‘ఎబ్బే‌, రాబోయే 122 రోజుల్లో వస్తుంద’ని చెప్పగా, ‘కాదు, కాదు 145 రోజుల్లోనే (ఇంకా అయిదు నెలలకట, అంటే డిసెంబర్‌నాటికి, అంటే 2014 ఎన్నికలకు మరో ‘గాలం’) ప్రకటన రాబోతోంద’ని మరొకరూ, ఇదీ అదీగారు, రానున్న 215 రోజుల్లోనే అంటే అంటే 2014 ఫిబ్రవరికల్లా (అంటే ఇదీ 2014 ఎన్నికలకు వేసిన గాలమే) ప్రత్యేకరాష్ట్ర ప్రకటన వెలువడుతుందని ఇంకొకరూ ఎవరికితోచిన ‘బుద్ధి’తో వారు ఉబుసుపోని ప్రకటనలు చేస్తూ యువకుల ఆత్మహత్యలకు బాధ్యత నుంచి తప్పించుకునే నానారకాల ‘పారుమాటలూ’చెబుతున్నారు!


 

అయితే ఇదే సందర్భంలో తెలంగాణాను ‘సీమాంధ్రులంతా దోచుకు తింటున్నార’ని బాహాటంగా మొత్తం ప్రజల్ని దోపిడీ దార్లుగా చిత్రించుతూ తెలంగాణా నుంచీ, హైదరాబాద్‌ నుంచీ టోకుగా ‘బంగీ కట్టి, కోస్తాంధ్రకు తోలేస్తామ’ని విషప్రచారాన్ని గత అయిదేళ్లుగా నిర్వహించిన తెలంగాణాలోని ‘బొబ్బిలి’వలసదారు నడమంత్రపు సిరిదారుడైన కె.సి.ఆర్‌, అతనికి అండగా నిలచిన ఆచార్యకోదండరామిరెడ్డి ఇప్పుడు గొంతులు మార్చారు! ఎందుకు? తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై వారికి అనుమానం వచ్చే బహుశా, గొంతులు మార్చారు. తమ‘పోరాటం’ తెలంగాణాను దోచుకునే ‘సీమాంధ్ర పెట్టుబడి దారులపైన’నే గాని సీమాంధ్ర ప్రజలపై కాదనీ, ‘‘సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్ర రాజకీయ పెత్తందార్ల పేరిట కృత్రిమ కుట్రల ఉద్యమం’అనీ వీరు గొంతు సవరించుకునే పరిస్థితి ఏర్పడిరది. ఇప్పటికైనా గొంతుకు తెచ్చుకున్న ‘సవరణ’మంచిదేగాని, అసలు ఒక్కటిగా ఉన్న తెలుగు జాతి ఎందుకు విడిపోవాలో వీరు సూటిగా సమాధానం ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు! తెలంగాణా ప్రజల్ని కోస్తాంధ్రుల న్యూనపరుస్తున్నారనీ, తెలంగాణా సాహిత్యాన్ని ‘దూషిస్తూ’న్నారనీ తెలంగాణా  సంస్కుతిని భ్రష్టు పట్టిస్తున్నారనీ తెలంగాణాను దోచుకోవడం ద్వారా కోస్తాంధ్రులు తెలంగాణాను ‘బికారి’గా మార్చారనీ, ‘అభివృద్ధి’ని కుంటుపర్చారనీ - ఇలా గణాంకాలతో, భౌతిక వాస్తవాలతో నిమిత్తంలేని వాదనలు చేస్తూ వచ్చారు.

 

సోదర తెలంగాణా ప్రజల్ని ఇంతకాలం న్యూనపరుస్తూ వచ్చిన ‘ఉద్యమ’నాయకులపై రాజకీయ నిరుద్యోగులే, గతంలోనూ ఇప్పుడూ మంత్రిపదవుల్లో ఉన్న తెలంగాణా నాయకుల్ని ‘దద్దమ్మలు, బలహీనుల’’నీ బహాటంగా ఆడిపోసుకుంటూ వచ్చింది కె.సి.ఆర్‌ ప్రభృతులే, చివరకు కాంగ్రెస్‌కు ఉద్యమాన్ని తాకట్టుపెట్టి, తానుగా ఆ ‘బలహీనుల’ జాబితాలో చేరిందీ కె.సి.ఆర్‌కి తెలంగాణా మిత్రులు కొందరు, తెలంగాణా  రాష్ట్ర ఏర్పాటును అభిలషిస్తున్న మిత్రులూ కొలది రోజుల నాడు ఏ సీమాంధ్ర పత్రికలోనూ కాదు, స్థానిక పెట్టుబడిదారుడైన రాజాం అధిపతిగా ఉన్న ‘నమస్తే తెలంగాణా’లో ప్రచురించిన వ్యాసంలో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత మన తెలంగాణాలో జరిగిన అభివృద్ధి గురించి రాసిన మాటలు సహృదయంతో పరిశీలించండి. సిక్కిం సెంట్రల్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న తెలంగాణా మిత్రులు డాక్టర్‌ ఓం ప్రసాద్‌గద్దె ఆ పత్రికలో ‘విభజన.. వ్యతిరేకుల వితండవాదాలు’’ అన్న మకుటం కింద తెలంగాణాలో విశాలాంధ్ర ఏర్పడిన తరువాత జరిగిన అభివృద్ధి గురించి జరిగిన యిలా పేర్కొన్నారు.

 

‘తెలంగాణాలోని మారుమూల పల్లెలు సైతం ప్రభుత్వ పథకాలతో అభివృద్ధిబాటన నడుస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నది. అలాగే, తెలంగాణాలో పట్టు సాధించిన నక్సలైట్లను నిర్మూలించేందుకు ప్రభుత్వమూ, పోలీసులూ తీసుకున్న ప్రత్యేక చర్యలతో మావోయిస్టులు ప్రభావం కోల్పోయారు. ఒకప్పుడు నక్సలైట్లకు కంచుకోటగా ఉన్న తెలంగాణా పల్లెలు ఇప్పుడు అలాగే లేవు. ఇప్పుడు తెలంగాణా గ్రామీణ ప్రాంతం స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒకప్పటి జమిందారీ విదానం, దొరల దోపిడీ పీడనలు, భూస్వాముల ఆగడాలు లేవు. కాబట్టి ఇప్పుడు మళ్లీ మావోయిస్టులు తెలంగాణాలో పట్టుసాధిస్తారనడం ఆసమంజసం. (‘నమస్తే తెలంగాణా’’: 20`7`013)!
 


(ఇదిలా ఉండగా, ఈనెల (జూలై) 2వ తేదీన తెలంగాణా సమస్యపై ‘కాంగ్రెస్‌పైన వత్తిడిని పెంచే పేరిట అయిదు వామపక్షాల (సి.పి.ఎం. మినహా) ఆధ్వర్యంలో ఒక రాష్ట్ర సదస్సు జరుపుతారట. ఈ వామపక్షాలలో ఒకటయిన ‘న్యూఢమోక్రసీ’ (మార్క్సిస్టు... లెనినిస్టు) పార్టీ రాష్ట్ర నాయకుడైన డి.వి.కృష్ణా ఒక ప్రకటన చేస్తూ చెప్పిన మాటలు అందరూ పరిశీలించదగినవిగా ఉన్నాయి.



"రాష్ట్ర విభజన జరిగితే నక్సలైట్ల సమస్య పెరుగుతుందనడం, తెలంగాణా ఏర్పడకుండా ఉంటే నక్సలైట్లు నిజంగానే పెరుగుతారనుకోవడం అనే రెండు వాదనలూ సరైనవికావు. తెలంగాణా ఏర్పడినంత మాత్రాన సమసమాజ వ్యవస్థ నెలకొంటుందని భావించలేము. ఇప్పటిమాదిరిగానే అప్పుడు కూడా ప్రజలు అణచివేతలకు దోపిడీకి గురి అవుతూనే ఉంటారు.'' అయినప్పడు (తెలంగాణా రాష్ట్రం ఏర్పడినాగాని సమసమాజ వ్యవస్థ నెలకొన్నప్పుడు తెలుగు జాతి అనుపమానమైన త్యాగాల ద్వారా సాధించుకున్న ఆంధ్రప్రదేశ్‌ను సమసమాజ వ్యవస్థ ఏర్పడకుండానే బలవంతంగా రాజకీయ నిరుద్యోగుల పాక్షిక పదవీ ప్రయోజనాలకోసం బలిపెట్టవలసిన అవసరందేనికొస్తోంది? విభజన కేవలం ‘విభజన’కోసమా? ‘సమసమాజ వ్యవస్థ’ నెలకొనాల్సిన అవసరం ఒక్క తెలంగాణా ప్రాంతానికే పరిమితమా, లేక యావత్తు తెలుగుజాతి కలలపంటైన యావత్తు విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్‌) ప్రజలకూ, రాష్ట్రానికీ అవసరం లేదా? యావత్తు రాష్ట్రంలోనూ అలాంటి ఉత్తమోత్తమ వ్యవస్థ అవసరాన్ని మనసారా అభిలషించే అభ్యుదయ వాది ఎవడైనా ఒక ప్రాంతం అభ్యుదయాన్ని మాత్రమే కోరుకోవడం సోషలిజం ప్రాధమిక లక్ష్యానికే విరుద్ధం కాదా? సోషలిజం మాట పెరుమాళ్లకెరుక, ఒకనాటి సోషలిస్టు సోవియట్ యూనియన్ రాజ్యాంగరీత్యా విడిపోయే హక్కును దాని సమాఖ్య సభ్యజాతులకు యిచ్చి కూడా సమాఖ్య రూపురేఖలు ఎందుకని చెల్లాచెదరైపోవలసి వచ్చింది?
 


యూనియన్‌ నుంచి విడిపోయిన రిపబ్లిక్కులకు కొన్ని అమెరికా.... పెట్టుబడి పాలనా వ్యవస్థకు ‘జోహామీం’ అనవలసి వస్తోంది? ఆ మాటకొస్తే యూరప్‌లోని కొన్నిదేశాలో కొన్ని రాష్ట్రాలు (ఒకే జాతీయులు) విడిపోయి మళ్లీ కలుసుకోవడానికి దారితీసిన పరిణామాలేమిటి? సహజవనరులు, నీటి పంపిణీ, వాటి నిర్వహణ తాలూకూ తలెత్తిన సమస్యలూ, తలనొప్పులూ ‘వామపక్షు’లకు తెలియవా? నిన్నగాకమొన్న నైయినదీజలాల పంపిణీ ఈజిప్టు దాని ఇరుగు పొరుగుల మధ్య ఎంతటి తీవ్రతితీవ్రమైన ఘర్షణలకు దారి తీశాయో వామపక్షులకు తెలియదా?! ఈ మధ్యనే విడిపోయిన ఐక్యసూడాన్‌ (ఉత్తర ` దక్షణ సూడాకలుగా) రెండుభాగాలూ మళ్లీ ఎందుకు పునరేకీకరణకోసం తహతహలాడుతూ ‘సంప్రతింపుల అధ్యాయాన్ని తెరవవలసి వచ్చింది? ఒకే సైద్ధాంతిక పునాదిమీద ఏర్పడిన, మార్క్సిను భావజాలకుల మధ్య అనైక్యత కూడా ఒకే జాతిప్రజల మధ్య విభజనకు కృత్రిమ పునాదులు లేపుతోంది! ఇప్పటికైనా ‘వామపక్షులు’ తెలుగు ప్రజల, తెలుగు సమాజం పరిపూర్ణ ప్రయోజనాల దృష్ట్యా పునరాలోచన చేసుకుని, రెండు రకాల పరాయి పాలనలవల్ల చెల్లా చెదరై శతాబ్దాల పాటు పరాయి పంచలలో బతుకులాడిస్తున్న తెలుగువారందరినీ ఒక్క గూడికి చేర్చిన తెలంగాణా సాయూధ పోరాట స్ఫూర్తిని మరొక్కసారి పొంది చరితార్ధులు కాగలరని మనసారా కోరుకుందాం!!