ఆమాద్మీ శకం ముగిసినట్లేనా

 

భక్తుడు కోరుకొన్నదే దేవుడు వరంగా ఇస్తాడన్నట్లు, జన్ లోక్ పాల్ బిల్లు పేరుతో రాజినామాకు సిద్దపడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ కు ఆ శ్రమ లేకుండానే, డిల్లీలోని ముండ్కా నియోజకవర్గం స్వతంత్ర శాసనసభ్యుడు రామ్‌బీర్‌ షోకీన్‌ ఆమాద్మీ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకోబోతున్నట్లు నిన్న ప్రకటించారు. ఆమాద్మీ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయనందుకు తను మద్దతు ఉపసంహరించుకొంటున్నానని తెలిపారు. కొద్ది రోజుల క్రితమే వినోద్ కుమార్ బిన్నీ అనే ఆమాద్మీ పార్టీ శాసనసభ్యుడు తనకు మంత్రి పదవి ఈయలేదని తిరుగుబాటు చేస్తే, అతనిని పార్టీ నుండి సస్పెండ్ చేసారు. కానీ, అతను ఇంకా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తుండటం వలన ఇంకా ప్రభుత్వం నిలబడి ఉంది. 70 మంది సభ్యులు ఉన్న డిల్లీ శాసనసభలో ప్రభుత్వం నిలబడాలంటే కనీసం 36 మంది మద్దతు అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఆమాద్మీ ప్రభుత్వానికి 28మంది స్వంత పార్టీ సభ్యులు, 8మంది కాంగ్రెస్ శాసనసభ్యులతో కలిపి మొత్తం 36 మంది మద్దతు ఉంది. కానీ, ఇప్పుడు రామ్‌బీర్‌ షోకీన్‌ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ సంఖ్య 35 అవుతుంది గనుక ఆమాద్మీ ప్రభుత్వం శాసనసభలో మెజార్టీ కోల్పోయి ప్రభుత్వం పడిపోతుంది. అరవింద్ కేజ్రీవాల్ ఎలాగు జన్ లోక్ పాల్ బిల్లుని సాకుగా చూపి, తన ప్రభుత్వాన్ని తానే కూల్చుకోవడానికి సిద్దపడ్డారు గనుక, ఇప్పుడు రామ్‌బీర్‌ షోకీన్‌ మద్దతు ఉపసంహరణతో ఆయన చేతికి మసి అంటకుండా ఆ పని పూర్తయిపోతుంది.

 

అరవింద్ కేజ్రీవాల్ డిల్లీ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేప్పటినపుడు దేశ రాజకీయాలలో ఒక సరికొత్త శకం, ప్రభుత్వపాలనలో ఒక నూతన ఒరవడి మొదలయిందని ఆయన ప్రభుత్వంపై డిల్లీ ప్రజలే కాకుండా యావత్ దేశప్రజలు కూడా చాలా ఆశలు పెట్టుకొన్నారు. రాజకీయ వ్యవస్థను, ప్రభుత్వ పాలన తీరుని సమూలంగా మార్చివేస్తానని హామీలు గుప్పించిన అరవింద్ కేజ్రీవాల్ అది తన శక్తికి మించినదని గ్రహించడం వలనో లేక ప్రభుత్వ యంత్రాంగంలో తను ఆశించిన విధంగా మార్పు తేలేననే అసహనంతో తన నిస్సహాయతకు తానే సిగ్గుపడుతూ దానిని కప్పిపుచ్చుకొనేందుకు ఘర్షణ వైఖరి అవలంభిస్తూ చేజేతులా తన ప్రభుత్వాన్ని కూల్చుకోవాలని ప్రయత్నిస్తున్నారో కానీ, నేడు రామ్‌బీర్‌ షోకీన్‌ ఆయన కోరిక తీర్చబోతున్నారు.

 

తమని అధికారంలో రాకుండా అడ్డుకొనేందుకే కాంగ్రెస్ ఆమాద్మీ పార్టీని ప్రోత్సహించి, మద్దతు ఇస్తోందని బీజేపీ చేసిన ఆరోపణలు కూడా ఇప్పుడు నిజమని నమ్మవలసి వస్తోంది. సరిగ్గా ఎన్నికల గంట మ్రోగే ముందు, ఆమాద్మీ ప్రభుత్వాన్ని తన చేతికి మసి అంటకుండా దింపేసి, సాధారణ ఎన్నికలతో బాటు డిల్లీలో కూడా మళ్ళీ శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ డిల్లీ ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోనేందుకే ఈ తాత్కాలిక ఏర్పాటు చేసుకొన్నట్లుంది. అత్యంత ప్రజాదారణ కలిగిన అమాద్మీ ప్రభుత్వానికి తాము బేషరతుగా మద్దతు ఇచ్చామని అయినా దానిని ఆమాద్మీ సద్వినియోగపరుచుకొని తను ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేకపోయినా కనీసం సరిగ్గా పరిపాలించలేకపోయిందని చాటింపు వేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇక నిర్భయంగా డిల్లీ ప్రజలను ఓట్లు అడగవచ్చును.

 

ఈ వైఫల్యంతో ఇక ఆమాద్మీ పార్టీ ఇక దేశంలోనే కాదు కనీసం డిల్లీలో కూడా మళ్ళీ ఓట్లు అడగలేని పరిస్థితి కల్పించుకొంది. ఆమాద్మీ ప్రయోగం ఈవిధంగా విఫలం కావడం యావత్ దేశప్రజలకు తప్పక విచారం కలిగిస్తుంది. డిల్లీ వంటి అతి చిన్నరాష్ట్రంలో గట్టిగా నెలరోజుల పాటు ప్రభుత్వాన్ని నడుపలేని ఆమాద్మీ పార్టీ రానున్న ఎన్నికలలో దేశ వ్యాప్తంగా వీలయినన్ని ఎక్కువ లోక్ సభ స్థానాలకు పోటీ చేయాలనుకోవడం చూస్తే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుంది.