రాజకీయాలలో ఐటెం గర్ల్!

 

సినిమాలలో ఐటెం గర్ల్స్ ను చూసాము. చివరికి క్రికెట్ వంటి ఆటలలో చీర్ గర్ల్స్ ని కూడా చూసాము కానీ, రాజకీయాలలో ఐటెం గర్ల్స్ ని ఎన్నడూ చూసి ఉండము. రాజకీయాలలో ఆమాద్మీ పార్టీ ఒక ఐటెం గర్ల్ వంటిదని ప్రముఖ రచయిత, ఆమాద్మీ పార్టీ మద్దతుదారుడయిన చేతన్ భగత్ వ్యాఖ్యానించడం విశేషం.

 

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సినిమా ఆఫర్లు దొరకని హీరోయిన్లు ఏవిధంగా ఐటెం గర్ల్స్ గా మారిపోతారో అదేవిధంగా ప్రభుత్వం నడపడం చేతకాని ఆమాద్మీ పార్టీ కూడా రాజకీయాలలో ఒక ఐటెం గర్ల్ గా మారిపోయిందిప్పుడు. సాక్షాత డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం వహించి నడిరోడ్డు మీద రెండు రోజులు ధర్నా చేయడాన్ని చూసి నేను చాలా సిగ్గుపడుతున్నాను. రానున్నఎన్నికలలో ఆమాద్మీ పార్టీ దేశవ్యాప్తంగా పోటీచేయబోతున్నందున దేశప్రజల దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నంలో ధర్నాకు కూర్చోవడం సిగ్గుచేటు,” అని అన్నారు.

 

దేశంలో తక్కువ ధర ప్లేన్ టికెట్స్ పరిచయం చేసిన గోపీనాథ్ ఆమాద్మీ పార్టీలో సభ్యుడు కూడా. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈవిధంగా నడిరోడ్డు మీద ధర్నాలు చేయడం ఏవిదమయిన సంకేతాలు పంపిస్తుంది? సమస్యలుంటే వాటిని తన కార్యాలయంలో కూర్చొని పరిష్కరించాలి తప్ప ఇలా నడిరోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేయడం, ప్రజలకి ఇబ్బందులు కలిగించడం సరయిన పద్ధతి కాదు,” అని అన్నారు.

 

ఒకప్పుడు ఆయనతో కలిసి పనిచేసిన మాజీ పోలీసు అధికారిణి కిరణ్ బేడీ మరో అడుగు ముందుకు వేసి, “పరిపాలించలేని ఆమాద్మీ ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్ చేయాలని కేంద్రాన్ని కోరారు.”

 

అపూర్వమయిన ప్రజాధారణతో ప్రభుత్వ పగ్గాలు చెప్పటిన ఆమాద్మీ పార్టీపై దేశ వ్యాప్తంగా ప్రజలు చాలా ఆశలు పెట్టుకొన్నారు. అదేవిధంగా ఆమాద్మీ పార్టీ కూడా ప్రజలకు అనేక ఆశలు రేపింది. బహుశః ఈ మూడు వారాల పాలనలోనే అవన్నీఆచరణ సాధ్యం కావని గ్రహించిందో లేక తన పరిమితులు గ్రహించడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈవిధమయిన చవకబారు ఎత్తుగడలతో కాలక్షేపం చేస్తోందో కానీ మొత్తం మీద, కేవలం మూడు వారాలలోనే ఆమాద్మీ తన పరువు పోగొట్టుకొంది.

 

వచ్చే ఎన్నికలలో దేశంలో అన్ని రాష్ట్రాలలో వీలయినన్ని ఎక్కువ యంపీ స్థానాలకు పోటీ చేస్తానని ప్రకటించిన ఆమాద్మీ ఈ ధర్నాతో ఇతర రాష్ట్ర ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేయబోతే అది కాస్తా బెడిసికొట్టి పార్టీ ప్రతిష్టను మంటగలపడం వలన తన అవకాశాలను తానే స్వయంగా పాడుచేసుకొన్నట్లయింది. ప్రజల సమస్యలు తీర్చుతుందని ఆమాద్మీని ఎన్నుకొంటే ఇప్పుడు అదే ప్రజలకు సమస్యగా మారడం విచిత్రం.

 

ఆమాద్మీ వైఫల్యం కాంగ్రెస్. బీజేపీలకు వచ్చేఎన్నికలలో వరంగా మారవచ్చును. అటువంటి పార్టీలకు ఓట్లు వేస్తే ఏవిధంగా వృధా అవుతాయో అవి కధలుకధలుగా చెప్పి, ప్రజలను తమ వైపుకి త్రిప్పుకోవచ్చును. అందువల్ల ఆమాద్మీ ఇప్పటికయినా మేల్కొని మిగిలిన కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని, తన హామీలను అమలుచేయలేకపోయినా, కనీసం డిల్లీలో చక్కని పాలన అందించే ప్రయత్నం చేసినా ఉన్నఆ పరువయినా మిగులుతుంది. లేకుంటే, వచ్చే ఎన్నికల తరువాత ఆమాద్మీ నామరూపాలు లేకుండా మయమయిపోవడం తధ్యం.