పశువులకూ ఆధార్ కార్డులు... దేశవ్యాప్తంగా అమలు...

వందల కోట్ల జనాభా ఉండే భారతదేశంలో ప్రతి ఒక్కరి వివరాలు తెలుసుకోవాలంటే ఒకప్పుడు అత్యంత కష్టసాధ్యమైన పని. అతను చెప్పేది నిజమో కాదో నిర్ధారించుకోవాలన్నా... రోజులూ నెలలూ పట్టేది. కానీ, ఆధార్ వ్యవస్థ వచ్చాక... యూనిక్ ఐడీ నెంబరు కొడితే చాలు అతని పేరు, వయసు, తండ్రి పేరు, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం... ఇలా అన్నీ వివరాలూ క్షణాల్లో తెలుసుకోగలుతున్నాం... ఇక, అతని ఫోన్ నెంబరు ఆధారంగా ఎక్కడున్నాడో... ఎటువైపు వెళ్తున్నాడో తెలుసుకునే స్థాయికి సాంకేతికత అభివృద్ధి చెందింది. అయితే, మనుషులకే కాదు... పశువులకూ ఐడెంటిఫికేషన్ నెంబరు వచ్చేసింది. భారతీయులందరికీ ఆధార్ నెంబరు ఉన్నట్లే... పశువులకూ యూనిక్ ఐడీ కేటాయిస్తున్నారు. 

దేశవ్యాప్తంగా పశువులకు యూనీ ట్యాగింగ్ ప్రారంభమైంది. ఆవులు, గేదెలు, దున్నలు, ఎద్దులు... ఇలా ప్రతి పశువుకూ ఒక యూనిక్ ఐడీ నెంబరును కేటాయించి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఈ యూనీ ట్యాగింగ్‌తో పశుగణనతోపాటు దాని యజమాని, గ్రామం... ఇలా ప్రతీది ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. మనుషుల్లో ఒక్కొక్కరి ఒక్కో నెంబరు ఉన్నట్లే... ప్రతి పశువుకూ డిఫరెంట్ యూనిక్ ఐడీ నెంబరు అలాట్ చేస్తూ.... ఆవులు, గేదెలు, దున్నలు, ఎద్దులకు ట్యాగింగ్ చేస్తున్నారు. అంటే, ఒక పశువుకు వేసే యూనిక్ ఐడీ నెంబరుతో దేశంలో మరొకటి ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండదన్న మాట. పశు సంతతి, వాటికి సోకే వ్యాధులపై కచ్చితమైన సమాచారం కోసమే ఈ యూనీ ట్యాగ్ విధానం తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. 

ఈ యూనీ ట్యాగ్‌లో యూనిక్ ఐడీ నెంబరుతోపాటు పశువు యజమాని పేరు, అతని ఫొటో, ఆధార్ నెంబరు, గ్రామం... ఇతర వివరాలతో జియో ట్యాగింగ్ ద్వారా రికార్డు చేసి, పశువు ఫొటో తీస్తున్నారు. అనంతరం టీకా వేసి, ట్యాగ్ కుట్టి, మొత్తం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ యూనీ ట్యాగ్‌‌లో నమోదు చేస్తున్న వివరాలతో భవిష్యత్తులో పశుశులకు ఏమైనా వ్యాధులు సోకితే ఆన్‌లైన్‌లో నమోదుచేసిన వివరాల మేరకు వేగంగా వైద్యం అందించవచ్చని చెబుతున్నారు. అంతేకాదు, ఈ విధానంతో పశువుల అక్రమ రవాణాను కూడా అడ్డుకోవచ్చని రైతులు అంటున్నారు.