మందులు రియాక్షన్ ఇచ్చాయా?

 

మనం ఎప్పుడైనా మందులు వేసుకుంటే ఒక్కోసారి అవి రియాక్షన్ ఇస్తూ వుంటాయి. సదరు మందులు మన శరీరానికి పడకపోవడం వల్ల రియాక్షన్ ఇస్తాయి. ఆ రియాక్షన్ వల్ల ఆ మందులు వ్యాధిమీద పనిచేయడం మాని కొత్త సమస్యలు వచ్చిపడుతూ వుంటాయి. ఈ విషయాన్ని డాక్టర్లకు చెబితే వాళ్ళు మందులు మార్చి రాస్తారు. అయితే మందులు పడకపోవడాన్ని సాధారణంగా వదిలేయాల్సిన విషయం కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంటోంది. ఆ మందులు ఎందుకు కొంతమందికి పడటం లేదు, ఎందుకు రియాక్షన్ ఇస్తున్నాయి... అనే అంశాల మీద తిరిగి పరిశోధన చేయాల్సిన అవసరం వుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. అందుకే దీనికి సంబంధించిన ఫిర్యాదులు, మందులు రియాక్షన్ చూపించిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు, ఆయా మందుల విషయంలో రోగులు ఎదుర్కొన్న అనుభవాలను రికార్డు చేసి, అవసరమైన పరిశోధలను చేయాలని అనుకుంటోంది. దీనికోసం 18001803024 అనే టోల్ ఫ్రీ నంబర్ని ఏర్పాటు చేసింది. ఈ నంబర్ని దేశంలోని అన్ని మందుల దుకాణాల ముందు ప్రదర్శిస్తారు. మందుల రియాక్షన్ ఎదురైన వారు ఈ నంబర్‌కి ఫోన్ చేసిన తమ అనుభవాలను చెప్పవచ్చు.