తిరుమాడ వీధుల్లో  పందుల సంచారం ! టీటీడీ తీరుపై భక్తుల ఆగ్రహం 

తిరుమల అంటే ఓ పవిత్ర పుణ్య క్షేత్రం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే వెంకన్న కొలువుదీరిన దివ్య స్థలం. నిత్య కల్యాణం.. పచ్చతోరణంలా నిత్యం కళకళలాడుతుంటుంది తిరుమల తిరుపతి దేవ స్థానం. ఎప్పుడూ గోవింద నామ స్మరణతో ఏడుకొండల సన్నిధి మార్మోగుతూ ఉంటుంది. అడుగడుగునా ఆధ్యాత్మిక శోభ, ప్రశాంత వాతావరణంతో భక్తులను పులకింపజేస్తుంది. అలాంటి పుణ్యక్షేత్రంలో ఇటీవలి కాలంలో అడవి పందుల సంచారం పెరిగిపోయింది. అడవి నుంచి ఓ పందుల గుంపు ఆలయ పరిసరాల్లో సంచరిస్తోంది. 

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయ మాడ వీధుల్లో పందుల గుంపు దర్జాగా సంచరిస్తూ వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాదాపు 11 పందులు గొల్ల మండపం నుంచి మాఢ వీధుల్లోకి ప్రవేశించాయి. ఆపై తమ కిష్టం వచ్చినట్టుగా తిరుగాడాయి. తిరుమాడ వీధుల్లో పందులు  స్వేచ్చగా తిరుగుతున్నా పట్టించుకున్న నాథులే కరువయ్యారు. చాలా సేపటి తర్వాత పందులను గమనించిన విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు వాటిని తరిమేసేందుకు అవస్థలు పడ్డారు. 

టీటీడీ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిశుభ్రతకు, పవిత్రతకు మారుపేరైన తిరుమలలో..వరాహాలు సంచరిస్తుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం స్వామివారి వాహన సేవలు జరిగే మాడ వీధుల్లో పందులు ప్రవేశించడమేంటని ప్రశ్నిస్తున్నారు.  దీనిపై స్పందించిన అధికారులు.. ఇకపై శ్రీవారి ఆలయం వద్దకు పందులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాడ వీధుల్లోకి పందులు వస్తున్న మార్గాన్ని గుర్తించి, అక్కడ ఇనుప కంచెలను వేశారు. స్వామి ఆలయం అటవీ ప్రాంతం కావడంతో ఇలా పందులు రావడం సహజమేనని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం భక్తుల మనోభావాలను కాపాడటంలో టీటీడీ బోర్డు విఫలమవుతోందని ఆరోపిస్తున్నారు.