సీబీఐ రచ్చ.. ఆలోక్‌ వర్మ రాజీనామా.. బదిలీలు రద్దు

 

సీబీఐ ప్రతిష్టకు భంగం కలిగేలా కేంద్రం ప్రవర్తిస్తుందని ఎన్ని విమర్శలు వస్తున్నా కేంద్రం వెనక్కి తగ్గట్లేదు. దానికితగ్గట్లే సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు.  తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పుతో బుధవారం మరోసారి సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌ను మళ్లీ తప్పిస్తూ కేంద్రం గురువారం సాయంత్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయనను ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా బదిలీ చేసింది.ఈ పరిణామాలతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా బాధ్యతలు చేపట్టకుండానే ఉద్యోగానికి రాజీనామా చేశారు.

మరోవైపు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాజీ సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ చేసిన బదిలీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలోక్‌, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా మధ్య విభేదాలు ముదరడంతో వారిద్దరినీ సెలవుపై పంపిస్తూ గతేడాది అక్టోబరు 23న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆలోక్‌ సుప్రీంను ఆశ్రయించారు. విచారణ నిర్వహించిన న్యాయస్థానం సీబీఐ డైరెక్టర్‌గా ఆయనకు తిరిగి పగ్గాలు అప్పగిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఆలోక్‌ బుధవారం తిరిగి విధుల్లో చేరారు. తాను వెళ్లిపోయాక సీబీఐలో చోటుచేసుకున్న బదిలీలను రద్దు చేశారు. ఆలోక్‌ను తొలగించడానికి కొన్ని గంటల ముందు ఆయన ఐదుగురు సీబీఐ ఉన్నతాధికారులను బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. వారందరి బదిలీలను తాత్కాలిక సీబీఐ డైరెక్టర్‌ నాగేశ్వరరావు రద్దు చేశారు. గతంలో ఉన్న స్థానాల్లోనే వాళ్లను కొనసాగాల్సిందిగా సూచించారు.