శ్రీబాగ్ ఒప్పందం మరిచిపోయారా ?.. రాయలసీమకు అన్యాయం!! 

 

శ్రీబాగ్ ఒప్పందం కుదిరి నేటికి సరిగ్గా 82 ఏళ్ళు అయ్యింది. ఈ ఒప్పందమే 1953 లో ఆంధ్రరాష్ట్రం, 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు మూలం. సీమ అభివృద్ధి కోసం నాడు చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని రాయలసీమ వాసులు ఇప్పటికే కోరుతున్నారు. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా హైకోర్ట్ ఏర్పాటు కోసం సీమవాసులు ఉద్యమాన్ని తీవ్రతరం చేసారు. నేడు ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. 

గతంలో శ్రీబాగ్ ఒప్పందం ఏ మేరకు అమలైంది. అనుకున్నట్టుగా సీమ అభివృద్ధి జరిగిందా.? 1937, నవంబర్ 16 న మద్రాసు లోని కాశీనాధుని నాగేశ్వరరావు గృహంలో శ్రీబాగ్ లో సమావేశమయ్యారు కోస్తా, సీమ ప్రాంత పెద్దలు. ఈ సమావేశంలోనే మద్రాసు నుంచి తెలుగువారిగా విడిపోదామన్న అవగాహనకు వచ్చారు, ఆ అవగాహనే శ్రీబాగ్ ఒప్పందం. శ్రీబాగ్ ఒప్పందం సరిగ్గా అమలు కాకపోవడం వల్లే రాయలసీమ వెనుకపడిందనే వాదనలు ఉన్నాయి. ఆ ఒప్పందం లోని కీలక అంశాలు పూర్తిగా ఉల్లంఘనకు గురయ్యాయనే భావనలో సీమవాసులు ఉన్నారు. 

కృష్ణా నదిలో లభ్యమయ్యే నీటిలో సీమకు సింహభాగం ఇవ్వాలని.. అందుకు అనుగుణంగా ప్రాజెక్ట్ లు నిర్మించాలి అని ఒప్పందంలో ఉంది. అయితే రాయలసీమలో నిర్మించిన శ్రీశైలం డ్యాం సైతం సీమకు ఉపయోగపడని రీతిలో నిర్మించారని సీమవాసులు పేర్కొంటున్నారు. రాజధానిగా కర్నూలును ఎంపిక చేసి 4 సంవత్సరాల తిరగకుండానే ఆంధ్రప్రదేశ్ పేరుతో దాన్ని హైదరాబాదుకు తరలించారని గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందం సందర్భంలో కనీసం శ్రీబాగ్ ఒప్పందం గురించి ప్రస్తావన లేకుండా నాటి పెద్దలు సీమకు తీరని అన్యాయం చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం ఏర్పాటైన ఒప్పందాలు సైతం సర్కారు నేతల స్వార్థం కారణంగా అమలు కాలేదని.. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిందన్న వాదనలు ఇప్పటికీ ఉన్నాయి.