లిఫ్ట్ లో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయిన ఎనిమిదేళ్ల చిన్నారి...

 

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. చలాకీగా తిరుగుతూ సందడి చేసే చిన్నారి ప్రాణాలు అమాంతంగా గాల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళ్తే  లిఫ్ట్ లో ఇరుక్కొని ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన ఎల్బీనగర్ హస్తినాపురం పరిధిలో పిండి పుల్లారెడ్డి కాలనీలో చోటు చేసుకుంది. కాలనీలో చంద్రశేఖర దంపతులు ఒక అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ కూతురు ఎనిమిదేళ్ల లాస్య స్కూలుకు సెలవులు కావటంతో శుక్రవారం సాయంత్రం ఆ చిన్నారి పొరుగింటి పిల్లలతో కలిసి ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. పిల్లలతో కలిసి ఆడుకుంటున్న లాస్య లిఫ్ట్ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు లిఫ్ట్ తలుపులు మూసుకు పోవటంతో అందులో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడింది.లిఫ్ట్ పై ఫ్లోర్ లో చిన్నారి తల కింద కాళ్ళు ఇరుక్కుపోయి నరక యాతన అనుభవించింది. తోటిపిల్లలు గట్టిగా అరవటంతో లాస్య తల్లిదండ్రులు పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను బయటకు తీశారు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చిన్నారి మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె ఇక లేదని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. చిన్నారి మృతి తో స్థానికంగా విషాదం ఛాయలు అలుముకున్నాయి. 

లిఫ్టులో పడి ఎనిమిదేళ్ల చిన్నారి చనిపోవడం పట్ల బాలల హక్కుల సంఘం తీవ్రంగా విచారం వ్యక్తం చేసింది. కొందరు భవన నిర్మాణదారులు నాసిరకం లిఫ్టులు పెట్టడంతో తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని బాలల హక్కుల సంఘం చైర్మన్ అచ్యుతరావు ఆరోపించారు.అపార్టుమెంట్ ల్లో నాణ్యమైన లిఫ్టులు సమకూర్చుకోవాలంటూ సూచించారు. లిఫ్ట్ నాణ్యతపై మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి ఆమోదించిన తర్వాతే బిగించేలా చర్యలు చేపట్టాలంటూ ఆయన సూచించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 

హైదరాబాద్ లో తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనిలో ఎక్కువ మంది చిన్నారులే ప్రాణాలు తమ ప్రాణాలు కోల్పొతున్నారు. చాలా తక్కువ సంఖ్యలో చిన్నారులు ప్రాణాలతో బయటపడుతున్నారు. దిల్ సుఖ్ నగర్ సార్ కిడ్స్ ప్రైవేటు పాఠశాలలో జహాన అనే చిన్నారి లిప్టు గ్యాప్ లో ఇరుక్కు పోవటంతో ప్రాణాలు విడిచింది. ముసారంబాగ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో జైనబ్ అనే నాలుగేళ్ల పాప లిఫ్టులో ఇరుక్కుని ప్రాణాలు వదిలింది. దీంతో పాటు రాజేంద్ర నగర్, చందా నగర్ లోనూ ఇటువంటి సంఘటనలే జరుగుతున్నాయి.రోజువారీ జీవితంలో లిఫ్టు, ఎస్కలేటర్లు, ఎలివేటర్లు ఎక్కటం తప్పనిసరైపోయింది. అపార్ట్ మెంట్లు, ఆఫీస్లు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ లో ఇలా ఎక్కడికి వెళ్లినా లిఫ్ట్ లేదా ఎస్కలేటర్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. అసలు లిఫ్టు ప్రమాదాలూ ఎందుకు జరుగుతున్నాయి, అపార్ట్ మెంట్ నిర్మాణ సమయంలో నాణ్యమైన లిఫ్టు బిల్డర్లు వాడకపోవటమే కారణమా, లిఫ్టు నాణ్యతపై మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించిన తరువాతే వాటిని బిగిస్తున్నారా లేదా అనే అంశాలపై అధికారులు పరిశోదించాల్సి ఉంటుంది. ఇటువంటి విషయాల పై విచారణ జరపాలని బాలల హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. తప్పు ఎవరిదైనా ఒక నిండు ప్రాణం మాత్రం బలైపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.