600మంది ఉద్యోగుల‌కు క‌రోనా.. స‌గం స్టాఫ్‌తో బ్యాంకు సేవ‌లు..

తెలంగాణ‌లో క‌రోనా సెకండ్ వేవ్ కుమ్మేస్తోంది. ప్ర‌జ‌ల‌తో నిత్యం సంబంధాలు ఉండే వారంద‌రికీ వైర‌స్ సోకుతోంది. తాజాగా, బ్యాంకు ఉద్యోగులు భారీగా కొవిడ్ బారిన ప‌డుతున్నారు. తెలంగాణ‌లో ఏకంగా 600 మంది ఎస్‌బీఐ ఉద్యోగుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు సంస్థ ప్ర‌క‌టించింది. ఆ మేరకు ఎస్‌బీఐ సీజీఎం ఓపీ మిశ్రా ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. 

క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. ఖాతాదారుల‌తో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కొవిడ్ భారిన ప‌డుతున్నారు అని తెలిపారు. క‌రోనా విజృంభ‌న కార‌ణంగా.. గురువారం నుంచి ఏప్రిల్ 30 వ‌ర‌కు స‌గం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో విధులు నిర్వ‌ర్తిస్తార‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లోని కోటి, సికింద్రాబాద్ ఎస్‌బీఐ కార్యాల‌యాల్లో ఉద్యోగుల కోసం ప్ర‌త్యేక కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ చేప‌ట్టామ‌ని తెలిపారు.