ఏపీలో రెండో విడత రైతు భరోసా ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ రైతు భరోసా రెండవ విడత పెట్టుబడి సాయాన్ని సీఎం వైఎస్‌ జగన్ ఈ రోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు రూ.1,114.87 కోట్ల నగదును బదిలీ చేశారు. మొత్తం 50.07 లక్షల మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. రైతు భరోసా రెండో విడతలో రైతులకు రూ.2 వేల చొప్పున ఇస్తున్నామని చెప్పారు. ఈ నెల 2న ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు అందించిన గిరిజనులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని, వారికి రూ.11,500 చొప్పున జమ చేస్తున్నామని తెలిపారు. లక్ష మంది గిరిజన రైతులకు రూ.104 కోట్ల సాయం చేస్తున్నాము. ఎటువంటి అవినీతి, వివక్ష లేకుండా పెట్టుబడి సాయం అందిస్తున్నాం. అర్హులందరికీ మేలు జరిగేలా వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమ చేస్తున్నాం అని సీఎం అన్నారు.

 

జూన్-సెప్టెంబర్ నెలల్లో వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారమందించింది. లక్షా 66 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ.135 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. పంట నష్టపోయిన సీజన్‌లోనే పరిహారం ఇవ్వడం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారని చెప్పారు. రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచేలా వైఎస్సార్ జలకళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఉచితంగా బోర్లు వేయడం, మోటార్లు అందించడం ద్వారా రైతన్న తన కాళ్లపై తాను నిలబడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వర్షాలు కురిసి ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయన్నారు. వరదలపై ప్రతిపక్షం చేస్తున్న రాజకీయాలు బాధ కలిగిస్తున్నాయని సీఎం న్నారు.