విమాన ప్రయాణం.. 166 మంది ప్రాణాలతో చెలగాటం

 

నిర్లక్ష్యం అసలు ఏ సందర్భంలోనూ ఉండకూడదని పెద్దలు చెప్తుంటారు.. నిర్లక్ష్యం కారణంగా కొన్ని సార్లు మన ప్రాణాలకే కాదు, తోటి వారి ప్రాణాలకు కూడా ముప్పొస్తుంది.. తాజాగా అలాంటి సంఘటనే ఓ విమానంలో జరిగింది.. జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 30 మంది విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న విమానంలో విమాన సిబ్బంది క్యాబిన్‌లో ఒత్తిడిని నియంత్రించే స్విచ్‌ను ఆన్‌ చేయడం మరిచిపోయారు.. ఫలితంగా విమానంలో తీవ్ర ఒత్తిడి ఏర్పడి 30 మంది ప్రయాణికులకు ముక్కు, చెవుల నుంచి రక్తం కారింది.. మరికొందరు తీవ్రమైన తలనొప్పితో సతమతమయ్యారు.. పొరపాటును గ్రహించిన సిబ్బంది విమానాన్ని తిరిగి ముంబైలో ల్యాండ్‌ చేశారు.. దీనిపై అప్పటికే సమాచారం అందుకున్న ముంబై విమానాశ్రయ సిబ్బంది విమానం దిగగానే అక్కడికక్కడే బాధితులకు చికిత్స అందజేశారు.. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.. ఈ ఘటన సమయంలో విమానంలో 166 మంది ప్రయాణికులు ఉన్నారు.. ఈ ఘటనపై డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఆ విమానంలో విధుల్లో ఉన్న సిబ్బందిని వెంటనే తప్పించింది.