పదవులకు రెన్యూవల్ ఉంటుందో.. లేదో.. ఆ ముగ్గురు టీఆర్ఎస్ సీనియర్లలో అలజడి

2020 సంవత్సరంలో తమ పదవీ కాలం ముగియనుండడంతో గులాబీ పార్టీలో ఆ సీనియర్ నాయకులకు రెన్యువల్ ఉంటుందో లేదో అనే గుబులు పట్టుకుంది 2020 లో తెలంగాణ రాష్ట్రం నుంచి 3 ఎమ్మెల్సీ, మరో 2 రాజ్యసభ స్థానాలకు పదవీ కాలం ముగియనుంది. అయితే వాటిలో ఒక ఎమ్మెల్సీ ఒక రాజ్యసభ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వారికి ఈ సారి రెన్యువల్ కష్టం అని టాక్ పార్టీలో మొదలైంది.

మాజీ హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. 2014 లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2020 తో ముగుస్తుంది. అయితే 2014 క్యాబినెట్ లో నాయనకీ చోటిచ్చిన కేసీఆర్, 2018 లో మాత్రం అవకాశమివ్వలేదు. అప్పట్నుంచీ నాయిని పార్టీ పై అసంతృప్తిగా ఉన్నారు. బహిరంగంగానే ఆవేదన వెళ్లగక్కిన నాయిని రీసెంట్ గా ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిశాక కార్మిక సంఘాల విషయంలో కూడా ప్రభుత్వం లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో ఆయనకి ఈ సారి పదవి డౌట్ అనే చర్చ జరుగుతోంది.

రాజ్యసభ సభ్యుడు కెకె పదవీ కాలం కూడా 2020 లోనే ముగుస్తుండటంతో కేకే పదవిపై కూడా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాయినితో పాటు కేకే కూడా గులాబీ పార్టీలో కీలక నాయకుడు. అయితే ఆర్టీసీ సమ్మె సమయంలో కేకే ప్రకటనలూ గులాబీ బాస్ ను నొప్పించాయని సమాచారం. దీనికి తోడు కేకే అన్ని పార్టీల నాయకులతో నిత్యం టచ్ లో ఉంటారు. కేకే వయసు కూడా ఎక్కువ ఉండడంతో ఆయన సీటు వేరెవరికీ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. దీంతో మిగతా వారి సంగతి పక్కనబెడితే కేకే అండ్ నాయిని నరసింహరెడ్డికి మాత్రం పదవి టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకూ అంటే అటు విపక్షాలు కూడా ఇపుడు పదవులు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. ఉన్న పదవులన్నీ టీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయి.

ఇక ఎమ్మెల్సీ రాములు నాయక్ పదవి కూడా 2020 తోనే ముగియనుంది. కాని ఆయన 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆయనకి కూడా పదవి లేదు. మరొక ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పదవి కూడా 2020 లోనే ముగుస్తుంది. కానీ ఈయనకు రెన్యువల్ పక్కా అని తెలుస్తోంది. కర్నెకు విప్ పదవి కూడా కేటాయించారు సీఎం. దీంతో ఆయనకు లైన్ క్లియర్ అయినట్టే. మొత్తానికి ఈ నేతలకు 2020 టెన్షన్ పట్టుకుంటే ఆశావహులు మాత్రం సంబరపడుతున్నట్లుగా తెలుస్తుంది. వీళ్లకు రెన్యువల్ కాకుంటే తాము ట్రై చేయొచ్చు అని. మరి గులాబీ బాస్ కేసీఆర్ ఆ ఇద్దరు సీనియర్లకు తిరిగి అవకాశం ఇస్తారా లేదా అన్నది 2020 సమాధానం చెప్పబోతోంది.