నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ.. ఇప్పటివరకు 27మంది మృత్యువాత...

దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్  కొనసాగుతోంది. ఈశాన్య ఢిల్లీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కర్ఫ్యూ, 144 సెక్షన్ అమల్లో ఉన్నా... అల్లరి మూకలు రెచ్చిపోతూనే ఉన్నాయి. పెద్దఎత్తున కేంద్ర బలగాలను రంగంలోకి దించినప్పటికీ, పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రావడం లేదు. దాంతో, రంగంలోకి దిగిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ... ఈశాన్య ఢిల్లీలో తిరుగుతూ స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. ఇక, ఢిల్లీ అల్లర్లలో ఇప్పటివరకు 27మంది మరణించగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

దేశ రాజధానిలో జరుగుతున్న హింసాకాండపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. 1984 ఘటనలను పునరావృతం కానివ్వరాదన్న న్యాయస్థానం... బాధితులకు సాయం అందించేందుకు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే, బాధితులను ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది.

కేంద్ర ప్రభుత్వంపై రజనీకాంత్  విమర్శలు గుప్పించారు. ఢిల్లీ అల్లర్లకు కేంద్ర హోంశాఖదే బాధ్యతన్నారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారుతుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని తలైవా ప్రశ్నించారు. హోంశాఖ, నిఘా వర్గాల వైఫల్యం వల్లే ఢిల్లీలో ఘర్షణలు జరిగాయని రజనీ ఆరోపించారు. 

ఢిల్లీ అల్లర్లపై అధికార, ప్రతిపక్షాల మధ్యా మాటల యుద్ధం జరుగుతోంది. హస్తిన ఘర్షణలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని సోనియాగాంధీ డిమాండ్ చేశారు. అయితే, రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కౌంటరిచ్చారు.