2029... ఏపీ నంబర్‌వన్

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2029 నాటికి దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా అభివృద్ధి  చెందేలా ఇప్పటి నుంచే కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. బుధవారం నాడు విశాఖపట్నంలో జరిగిన ఫార్చున్ ఇండియా - 500 ర్యాంకింగ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. దాదాపు 100 మందికి పైగా సంస్థల సీఈవోలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో చంద్రబాబు నాయుడు కొత్త రాష్ట్రంలో వ్యాపార అవకాశాల మీద కీలక ప్రసంగం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన ప్రకటించారు. రానున్న మూడేళ్ళలో రాష్ట్రంలోని అన్ని ఇళ్ళకూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నామని తెలిపారు. గ్రామాల్లో కూడా పట్టణ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. పరిశ్రమల అనుమతికి సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని, పరిశ్రమలకు 21 రోజుల్లో అనుమతి వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సముద్ర తీరానికి సమాంతరంగా మరో జాతీయ రహదారిని నిర్మిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.