గెలుపు ధీమా.. ఢిల్లీ ఎన్నికల్లో విజయం తమదే అంటున్న ప్రధాన పార్టీలు!

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడి గెలుపును అన్ని పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రం పై జెండా ఎగుర వేసేందుకు ప్రధాన పార్టీలు వినూత్న ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. అయితే రాష్ట్రం చిన్నది అయినా అసెంబ్లీ సీట్లు తక్కువ గానే ఉన్నా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది ఢిల్లీ. దేశ రాజధాని కావడం అందులో అన్ని వర్గాల.. రాష్ర్టాల.. ప్రజలు నివసిస్తూ ఉండటమే ఇందుకు కారణం. ఈ ఎన్నికల్లో దాదాపు కోటిన్నర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

కేవలం నెల వ్యవధిలోనే ఢిల్లీ ఓటర్లు పూర్తి భిన్నమైన తీర్పునిస్తారన్న దానికి గతంలో జరిగిన ఎన్నికలే నిదర్శనం. 2013 ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ఆమాద్మీ పార్టీ 28 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని 48 రోజుల పాటు ప్రభుత్వాన్ని నడిపే చేతులెత్తేసింది. తరువాత 2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఏడు పార్లమెంటు స్థానాలకు ఏడు సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఏకంగా 67 స్థానాల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. బిజెపి మాత్రం కేవలం మూడు స్థానాలను గెలుపొందగా, కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఇక ఈ సారి జరగనున్న ఎన్నికలు అధికారంలో ఉన్న ఆమాద్మీ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య ప్రధాన పోరుగా ఆయా పార్టీలు భావిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకతను అవకాశంగా చేసుకుని హస్తిన అసెంబ్లీలో పునః వైభవం సాధిస్తామని హస్తం పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.