15 వ ఆర్థిక సంఘం నివేదిక.. రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి షాక్!!

రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి షాక్ ఇస్తూ 15 వ ఆర్థిక సంఘం తన నివేదికను సిద్ధం చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో భారీగా కోత విధించింది. ప్రస్తుతం ఉన్న 42 శాతం నిధుల బదలాయింపును తగ్గిస్తూ సిఫారసులు చేసినట్లు సమాచారం. ప్రత్యక్ష కేటాయింపులు తగ్గించి వివిధ రూపాల్లో రాష్ట్రాలకు అందించే గ్రాంట్లను పెంచుతున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఎన్కె సింగ్ నేతృత్వం వహించిన ఆర్ధిక సంఘం తన నివేదికను గత ఏడాది డిసెంబర్ లోనే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అందించింది. పథకాలకు నిధులను తగ్గించి రెవిన్యూ లోటు, విపత్తునిధి మున్సిపల్, పంచాయితీలు ఇతర స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్ లను పెంచిందని అధికార వర్గాలు తెలియజేశాయి. రాష్ట్రాల పని తీరు ఆధారంగా ప్రోత్సాహకాలను కూడా ఇవ్వాలని సిఫారసు చేసినట్లు సమాచారం. 

గ్రామీణ, సామాజిక రంగాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తమ విధానాలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశముంది. ఈ సిఫారసులు 14 వ ఆర్థిక సంఘానికి భిన్నంగా ఉన్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఉన్న 32 శాతం నిధుల కేటాయింపును 14 వ ఆర్థిక సంఘం 42 శాతానికి పెంచి గ్రాంట్లను తగ్గించింది. 15వ ఆర్ధిక సంఘం తద్భిన్నంగా నిధులు తగ్గించి గ్రాంట్లను పెంచుతుంది. నిధుల్లో తగ్గుదల వల్ల అనేక రాష్ట్రాలు చేపడుతున్న సంక్షేమ పథకాలకు గట్టి దెబ్బ పడనుంది, నిధుల లేమితో వాటిని కుదించడమో లేక ఆపేయటమో చేయాలి. గ్రాంట్ల పెంపు అనేది షరతులకు లోబడి ఉంటుందని రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఈ దృష్ట్యా కూడా తమకు భారమేనని రాష్ట్ర అధికార వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర ఖజానాపై భారం తగ్గుతున్నప్పటికీ రాష్ట్రాలకు భారం పెరుగుతుందని, తద్వారా అభివృద్ధి ప్రాజెక్టులను సైతం ఆశించిన రీతిలో చేపట్టలేక పోవచ్చునని రాష్ట్రంలో ఆందోళన నెలకొనవచ్చని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

పని తీరు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న సిఫారసు సరిగ్గా అమలు జరగకపోవచ్చని, పర్ఫామెన్స్ ఎసెస్ మెంట్ అనేది కేంద్రం చేతిలోనే ఉంటుంది కాబట్టి సరిగ్గా న్యాయం జరగదని రాష్ట్రాల నుంచి సిఫారసులు రావచ్చు. కానీ ఈ సిఫారసులతో కేంద్ర ప్రభుత్వానికి ఊరటనిస్తుందని ఓ అధికారి తెలిపారు. 2020, 2021 వార్షిక బడ్జెట్ కు ఇంకా పది రోజుల గడువు ఉందనగా ప్రస్తుతం ద్రవ్యలోటు జిడిపిలో 3.6 ఉంది. అంచనా 3.3 శాతం కంటే ఇది ఎక్కువ, ఇక రెవిన్యూ కూడా భారీగా పడిపోయింది.ఫలితంగా ఆదాయం, వ్యయం మధ్య వ్యత్యాసం 114 శాతానికి పెరిగి పోయింది. ఈ దశలో రాష్ర్టాలకూ ఉదారంగా నిధులు ఇచ్చే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. 15 వ ఆర్థిక సంఘం సిఫారసులు నిజంగా ఈ లైవ్ లోనే ఉంటే రాష్ట్రాల నుంచి ప్రతిఘటన తప్పదని పలువురు ఆర్థిక రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధుల తగ్గింపులో ప్రతిపక్షాలు వ్యతిరేకించవచ్చునని వారంటున్నారు. జీఎస్టీ కింద రావాల్సిన మొత్తాన్నే కేంద్రం నెలల తరబడి ఇవ్వటం లేదు, ఇక పన్నుల వాటా కింద నిధుల్లో కోత పెట్టడమే కాక ఆ కోత పెట్టిన మొత్తాన్ని కూడా సకాలంలో ఇస్తుందన్న నమ్మకం లేదని రాజకీయ విశ్లేషకులు తమదైన వాదనను వినిపిస్తున్నారు.